బీహార్ రాష్ట్రం జహానాబాద్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు. ఏకంగా తరగతి గదిలో విద్యార్థులతో పాటు వెనుక బెంచీలో కూర్చుని పాఠాలు విన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యాశాఖను మెరుగుపరిచేందుకు జిల్లా యంత్రాంగం తీవ్ర చర్యలు తీసుకుంటున్న తరుణంలో కలెక్టర్ చేసిన ఈ ఆకస్మిక తనిఖీ విద్యాశాఖలో తీవ్ర సంచలనం సృష్టించింది.
రాజా బజార్ ప్రాంతంలో ఉన్న మురళీధర్ హైస్కూల్, సరస్వతీ విద్యా మందిర్ పాఠశాలలను జిల్లా కలెక్టర్ ఇషితా వై భూటియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలకు చేరుకున్న ఆమె ఎలాంటి హడావుడి లేకుండా నేరుగా ఓ తరగతి గదిలోకి వెళ్లారు. అక్కడ ఓ ఉపాధ్యాయుడు పిల్లలకు గణితం బోధిస్తున్నాడు.
వెనుక బెంచీలో కూర్చున్న కలెక్టర్ తరగతికి ఎలాంటి అంతరాయం కలిగించకుండా కలెక్టర్ చాలా ప్రశాంతంగా వెళ్లి విద్యార్థులతో పాటు వెనుక బెంచీలో కూర్చున్నారు. క్లాస్ పూర్తయ్యే వరకు ఉపాధ్యాయుడి బోధనా విధానాన్ని, విద్యార్థులు నేర్చుకుంటున్న తీరును ఆమె నిశితంగా గమనించారు. ఆ తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయుడిని పిలిచి విద్యా ప్రమాణాలపై కొన్ని ప్రశ్నలు వేశారు. అనంతరం పాఠశాలలోని ఇతర ప్రాంగణాలను, ల్యాబ్లను పరిశీలించగా పలు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తనిఖీలో బయటపడిన వాస్తవాలు ఇవే:
- ఉపాధ్యాయుల తీరు: కలెక్టర్ అడిగిన కనీస (బేసిక్) ప్రశ్నలకు కూడా బయోలజీ, ఫిజిక్స్ ఉపాధ్యాయులు సరైన సమాధానాలు చెప్పలేకపోయారు.
- సాంకేతికతపై అవగాహన లేమి: డిజిటల్ విద్య కోసం ఉద్దేశించిన ‘Philo App’ వినియోగంపై ఉపాధ్యాయులకు ఏమాత్రం అవగాహన లేదు.
- రికార్డుల నిర్వహణలో వైఫల్యం: క్యాష్ బుక్, డెవలప్మెంట్ ఫండ్, స్టూడెంట్ ఫండ్కు సంబంధించిన రికార్డులను సమర్పించాలని ప్రధానోపాధ్యాయుడిని అడగ్గా, ఆయన వెంటనే వాటిని చూపించడంలో విఫలమయ్యారు.
- నిర్లక్ష్యం: పాఠశాల నిర్వహణ కమిటీ సమావేశాలు సరిగ్గా జరగకపోవడం, తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశాలు (PTA Meetings) కనీసం నిర్వహించకపోవడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండటం, పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిపై కలెక్టర్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని, పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడమే తన ప్రథమ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.
