పాత పేపర్ చదివిన వ్యక్తికి కొట్టిన జాక్‌పాట్.! ఇంటి అటకపై ఉన్న పోకీమాన్ (Pokémon) కార్డులు.. రూ.20 కోట్లకు విక్రయం.!!

ఇంగ్లాండ్‌కు చెందిన ఓ రిటైర్డ్ డెకరేటర్ (అలంకరణ నిపుణుడు), సుమారు 15 ఏళ్లుగా తన ఇంటి అటకపై భద్రపరిచిన పోకీమాన్ కార్డుల ద్వారా ఏకంగా కోట్ల రూపాయలు సొంతం చేసుకున్నాడు.

అతను జాగ్రత్తగా దాచి ఉంచిన ఈ కార్డుల కలెక్షన్ అంతా కలిసి వేలంలో 15.6 లక్షల పౌండ్లకు అమ్ముడుపోయింది. భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.20 కోట్లు. ఇన్నేళ్లుగా తన వద్ద ఉన్న ఆ కార్డులకు ఇంత విలువ ఉంటుందని ఆయన ఏమాత్రం ఊహించలేదు.

ఇంగ్లాండ్‌లోని వోకింగ్ (Woking) నగరంలో నివసిస్తున్న ఆయన.. స్థానిక దినపత్రికలో ఓ పోకీమాన్ కార్డు 6,000 పౌండ్లకు పైగా అమ్ముడుపోయిందన్న వార్తను చదివాడు. అది చూసిన తర్వాతే తన దగ్గర ఉన్న పాత కార్డులు కూడా ఎక్కువ ధరకు అమ్ముడుపోతాయా అనే ఆలోచన ఆయనకు వచ్చింది. దీంతో తన వద్ద ఉన్న కలెక్షన్ విలువను తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. చివరకు సర్రే (Surrey) ప్రాంతంలోని ఎవ్‌బ్యాంక్స్ (Ewbank’s) వేలం కేంద్రంలో అతని కార్డులు రూ.20 కోట్లకు అమ్ముడుపోయాయి.

1990ల చివరలో అతని కొడుకు పాఠశాలలో స్నేహితులతో కలిసి పోకీమాన్ కార్డులను సేకరించి ఆడుకునే సమయంలో ఈ కథ మొదలైంది. ఆ కార్డులు చూడటానికి ఆకర్షణీయంగా ఉండటంతో, భవిష్యత్తులో వీటికి మంచి ధర వస్తుందని భావించిన తండ్రి.. పెట్టుబడి కోణంలో విడిగా కొన్ని కార్డులను కొనుగోలు చేశాడు. మలేషియాకు చెందిన ఓ వ్యక్తి నుంచి ఈబే (eBay) ద్వారా కొన్ని పూర్తి సెట్లను కూడా కొన్నాడు. అప్పట్లో అందులో ఒక సెట్‌ను 300 పౌండ్లకు కొనుగోలు చేయగా, అదే సెట్ ఇప్పుడు వేలంలో ఏకంగా 75,000 పౌండ్లకు అమ్ముడుపోవడం విశేషం.

ఈ కార్డులను పోకీమాన్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బైండర్లలో (Binders) భద్రపరిచారు. వాటి సీల్స్ కూడా తెరవకుండా పదిలంగా ఉంచారు. కొడుక్కి పోకీమాన్‌పై ఆసక్తి తగ్గిన తర్వాత ఆ కలెక్షన్‌ను తీసుకెళ్లి అటకపై పెట్టారు. అలా సుమారు 15 ఏళ్ల పాటు అక్కడే ఉన్న ఆ కార్డులు.. ఇప్పుడు ఆయనకు భారీ మొత్తాన్ని తెచ్చిపెట్టాయి. బ్రిటన్‌లో ఒక ట్రేడింగ్ కార్డ్ కలెక్షన్‌కు లభించిన అత్యధిక వేలం ధర ఇదేనని చెబుతున్నారు. అయితే, పాత కార్డులన్నింటికీ ఇంత ధర రాదు; వాటి అరుదైన స్వభావం, పదిలంగా భద్రపరిచిన స్థితి, కలెక్టర్లలో వాటికి ఉన్న డిమాండ్ ఆధారంగానే వాటి ధర నిర్ణయించబడుతుంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *