పాప్‌కార్న్ తినడం చెడు అలవాటు అని అనుకుంటున్నారా..? అసలు నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

థియేటర్లలో సినిమా చూసేటప్పుడు ఇష్టంగా తినే స్నాక్స్‌లో పాప్‌కార్న్‌కు ప్రత్యేక స్థానం ఉంది.

అయితే పాప్‌కార్న్ అంటేనే ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారం అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కానీ, సరైన పద్ధతిలో తయారుచేసిన పాప్‌కార్న్‌ను కేవలం ‘జంక్ ఫుడ్’ అని మాత్రమే కొట్టిపారేయలేం.

మొక్కజొన్నతో తయారయ్యే పాప్‌కార్న్‌లో పీచు పదార్థం (ఫైబర్) పుష్కలంగా ఉంటుంది. పీచు పదార్థం అధికంగా ఉండే ఆహారాలు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు, కడుపు నిండిన భావనను కలిగించి ఎక్కువసేపు ఆకలి వేయకుండా చూస్తాయి. అందువల్ల, మితంగా తీసుకుంటే పాప్‌కార్న్ ఒక మంచి ఆరోగ్యకరమైన స్నాక్‌గా ఉపయోగపడుతుంది.

అయితే పాప్‌కార్న్ వల్ల కలిగే ప్రయోజనాలు అది ఎలా తయారైంది అనే అంశంపైనే ఆధారపడి ఉంటాయి. అధిక మొత్తంలో వెన్న (బట్టర్), నూనె, ఉప్పు లేదా పంచదార కలిపిన పాప్‌కార్న్‌ను తరచూ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచి ఎంపిక కాదు. ముఖ్యంగా సినిమా థియేటర్లలో దొరికే పాప్‌కార్న్‌లో అదనంగా కలిపే పదార్థాలు, కొవ్వుల విషయంలో జాగ్రత్త వహించాలి.

కాబట్టి, పాప్‌కార్న్‌ను పూర్తిగా తినకూడని ఆహారంగా భావించకుండా.. దాని తయారీ విధానం మరియు తినే పరిమాణాన్ని గమనించుకోవడం ముఖ్యం. తక్కువ నూనె, తక్కువ ఉప్పుతో ఇంట్లోనే సహజంగా తయారుచేసిన పాప్‌కార్న్‌ను మితంగా తీసుకోవడం ఎంతో మంచిది. ఏ ఆహారమైనా మితంగా తిన్నప్పుడే శరీరానికి ఆరోగ్యం.


Posted

in

by

Tags: