‘పాము.. పాము..’ అని కేకలు వేసి నాటకం: 400 అడుగుల కొండపై నుండి నెట్టేసి కాబోయే భర్త హత్య.. పుణే యువతి ‘మాస్టర్ ప్లాన్’ ఎలా దొరికిందంటే?

ముంబై: మహారాష్ట్రలోని పుణే నగరంలో జరిగిన ఒక ఘోర హత్య ఉదంతం కలిగించిన ప్రకంపనలు అక్కడ ఇంకా తగ్గలేదు. బాగా చదువుకుని, అత్యంత సంపన్న వర్గానికి చెందిన ఒక కుటుంబంలోనే ఇలాంటి దారుణం జరగడం అక్కడి ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ కేసుకు సంబంధించిన విచారణలో, నిందితురాలైన యువతి క్రైమ్ సీన్ వద్ద ఏం చేసింది? పోలీసులు దర్యాప్తులో తేల్చిన సంచలన నిజాలు ఏంటి? అనే వివరాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.

పుణేకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త విశాల్ అగర్వాల్ కుమారుడు కేతన్ విశాల్ (25) ఒక పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇతనికి ‘సియా గోయల్’ అనే యువతితో ఇటీవలే ఘనంగా వివాహం నిశ్చయమైంది (ఎంగేజ్‌మెంట్ జరిగింది).

400 అడుగుల లోయ – రూ. 17 కోట్ల పెళ్లి బడ్జెట్:
ఈ ఏడాది చివర్లో రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్‌పూర్‌లోని ఒక లగ్జరీ ప్యాలెస్‌లో దాదాపు 17 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో వీరి వివాహాన్ని అత్యంత వైభవంగా జరిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం విదేశాలు, ఇతర ప్రాంతాల నుండి వచ్చే విఐపి అతిథుల కొరకు రెండు ప్రత్యేక విమానాలను (చార్టర్డ్ ఫ్లైట్స్) కూడా ముందే బుక్ చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో, గత జూన్ 18వ తేదీన సియా గోయల్ తన కాబోయే భర్త కేతన్‌ను పుణేకు సమీపంలో ఉన్న ప్రసిద్ధ ‘లోహాగడ్ కోట’ (Lohagad Fort) కు సరదాగా టూర్ వెళ్దామంటూ బలవంతం చేసి తీసుకువెళ్లింది. అయితే అందరూ ఊహించని విధంగా, అక్కడ 400 అడుగుల ఎత్తైన కొండపై నుండి కేతన్ కిందపడి ఘోరంగా మరణించాడు.

ఏడ్చూ.. డ్రామాలు ఆడిన సియా:
ఈ ఘటనపై పోలీసులు మొదట సియాను విచారించగా.. “మేము కొండపై ఫోటోలు తీసుకుంటున్నాము. ఆ సమయంలో అకస్మాత్తుగా బలమైన గాలి వీచింది. ఫోటో తీయడానికి ప్రయత్నిస్తూ కేతన్ కాలుజారి ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు” అంటూ పోలీసుల ముందు గట్టిగా ఏడుస్తూ నమ్మించే ప్రయత్నం చేసింది.

అయితే, కేతన్ మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు.. సియాను మళ్లీ లోతుగా ప్రశ్నించారు. ఆ సమయంలో ఆమె పరస్పర విరుద్ధమైన సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చిన పోలీసులు విచారణను మరింత తీవ్రతరం చేశారు.

తీగ లాగితే డొంక కదిలినట్లు.. అసలు సియాకు ఈ పెళ్లి ఇష్టం లేదనే నిజం బయటపడింది. ఆమె తాను పని చేసే ఆఫీస్‌లోనే ‘చేతన్ చౌదరి’ అనే యువకుడిని గత ఏడాదిన్నరగా ప్రాణంగా ప్రేమిస్తోంది. కానీ, కేతన్ భారీ ఆస్తిపాస్తులు ఉన్న కోటీశ్వరుడు కావడంతో కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఈ పెళ్లికి ఒప్పుకుంది. తన ప్రేమకు అడ్డుగా ఉన్న కేతన్‌ను అంతమొందించి, దానిని ఒక ప్రమాదంగా చూపించడానికి తన ప్రియుడితో కలిసి ఆమె పక్కా స్కెచ్ వేసినట్లు విచారణలో తేలింది.

పోలీస్ అధికారి వెల్లడించిన వివరాలు:
ఈ కేసుపై పుణే పోలీస్ అధికారి సందీప్ సింగ్ మాట్లాడుతూ.. “కేతన్, సియా మధ్య మంచి స్నేహం ఉండేది. త్వరలోనే వీరిద్దరికీ వివాహం జరగాల్సి ఉంది. ఉదయ్‌పూర్‌లో రూ. 17 కోట్లతో ప్యాలెస్ బుకింగ్, అతిథుల కోసం 2 విమానాలు కూడా సిద్ధం చేశారు.

కానీ సియా తన సహోద్యోగి చేతన్‌ను ప్రేమించింది. వీరి బంధానికి కేతన్ అడ్డుగా ఉన్నాడని భావించి, చేతన్ మరియు సియా కలిసి కుట్ర పన్నారు. కేతన్ అగర్వాల్‌ను కొండపై నుండి లోయలోకి తోసి హత్య చేశారు” అని తెలిపారు.

సరదా టూర్ పేరుతో నాటకం:
“సరదాగా టూర్ వెళ్దామని నమ్మించి సియానే కేతన్‌ను లోహాగడ్ కోటకు తీసుకెళ్లింది. ప్లాన్ ప్రకారం కొద్దిసేపటికే తన ప్రియుడు చేతన్‌ను కూడా రహస్యంగా అక్కడికి రప్పించింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కేతన్‌ను వెనుక నుండి లోయలోకి నెట్టేసి, ఏమీ తెలియనట్లు ప్రమాదం అంటూ నాటకమాడారు” అని పోలీస్ అధికారి వివరించారు.

చిక్కారు ఇలా..:
ఘటనా స్థలంలో సియా ప్రియుడు చేతన్ కూడా ఉన్నట్లు అతని మొబైల్ ఫోన్ సిగ్నల్ (టవర్ లొకేషన్) ద్వారా పోలీసులు ఆధారాలు సేకరించారు. ఆ ప్రాంతంలోని సిసిటివి ఫుటేజ్, వీరిద్దరి కాల్ డేటా రికార్డులు (CDR) మరియు అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షుల ప్రకటనల ఆధారంగా సియా, చేతన్ ఇద్దరినీ పోలీసులు ఐపీసీ సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు.

‘పాము.. పాము..’ అంతకుముందే ఒక ప్రయత్నం:
పోలీసుల తదుపరి విచారణలో మరికొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. జూన్ 18 కంటే ముందే.. అంటే జూన్ 14న కూడా కేతన్‌ను అదే కొండపై నుండి తోసేయాలని సియా ప్రయత్నించింది. అప్పుడు అకస్మాత్తుగా “పాము.. పాము..” అని గట్టిగా అరుస్తూ భయపడినట్లు నటించి, అతని దృష్టి మళ్లించి కొండపై నుండి కిందకు నెట్టాలని చూసింది. కానీ ఆ ప్లాన్ ఫలించలేదు.

అంతేకాకుండా, పెళ్లికి ముందే ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం కేతన్ తన కాబోయే భార్య సియాతో కలిసి ‘బాలి’ (Bali Island) వెళ్ళాలని ప్లాన్ చేశాడు. కానీ ఆ ప్రయాణాన్ని చెడగొట్టడానికి సియా ఉద్దేశపూర్వకంగానే కార్లో ఉన్న కేతన్ పాస్‌పోర్టును దొంగిలించి దాచేసింది. తద్వారా ఆ ట్రిప్ రద్దయ్యేలా చేసిందని పోలీసుల విచారణలో నగ్నసత్యాలు వెల్లడయ్యాయి.


Posted

in

by

Tags: