పార్లే అనేది కేవలం ఒక బిస్కెట్ బ్రాండ్ మాత్రమే కాదు, అది ప్రతి భారతీయ ఇంట్లో వినిపించే పేరు. దాదాపు ఒక శతాబ్ద కాలంగా మారుతున్న రుచులు, పోటీ మరియు ఆర్థిక మార్పులను తట్టుకొని నిలబడిన ఘనత దీనిది. పార్లే-జీ నుండి మొనాకో, హైడ్ అండ్ సీక్ వరకు ఈ బ్రాండ్ భారతీయ ఎఫ్ఎంసీజీ (FMCG) రంగాన్ని మలుపు తిప్పింది.
పార్లే యాజమాన్యం పార్లే ప్రోడక్ట్స్ యాజమాన్య హక్కులు చౌహాన్ కుటుంబం వద్ద ఉన్నాయి. ఇది ప్రభుత్వ సంస్థ కాదు మరియు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీ కూడా కాదు. ఇది పూర్తిగా ఒక ప్రైవేట్ భారతీయ సంస్థ. దీనిని 1929లో మోహన్‌లాల్ దయాల్ చౌహాన్ స్థాపించారు. 2026లో కూడా ఈ సంస్థ ఆయన వంశస్థుల ద్వారానే నడపబడుతోంది. ప్రస్తుతం విజయ్ చౌహాన్ ఈ సంస్థకు అధ్యక్షుడిగా మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. శరద్ చౌహాన్, రాజ్ చౌహాన్ కూడా కంపెనీ బాధ్యతలను చూసుకుంటున్నారు.
యజమానుల మతం ఏమిటి? చౌహాన్ కుటుంబం హిందూ మతానికి చెందినవారు. వీరు మూలతః గుజరాత్ రాష్ట్రంలోని వల్సాడ్ జిల్లాకు చెందిన ‘పార్డి’ నివాసులు. పార్లే సంస్థ స్థాపన వెనుక బలమైన దేశభక్తి ఉంది. మోహన్‌లాల్ దయాల్ చౌహాన్ ముంబైలో పట్టు వ్యాపారిగా ఉండేవారు. 1920వ దశకంలో వచ్చిన స్వదేశీ ఉద్యమం ఆయనను బాగా ప్రభావితం చేసింది. అప్పట్లో బిస్కెట్లు బ్రిటన్ నుండి దిగుమతి అయ్యేవి మరియు అవి కేవలం ధనికులకే అందుబాటులో ఉండేవి. దీనిని మార్చాలని ఆయన జర్మనీ వెళ్లి మిఠాయిల తయారీ సాంకేతికతను నేర్చుకుని, సుమారు ₹60,000 విలువైన యంత్రాలతో భారత్ తిరిగి వచ్చారు. 1928-29లో ముంబైలోని ‘విలే పార్లే’ అనే ప్రాంతంలో కేవలం 12 మంది కుటుంబ సభ్యులతో ఒక చిన్న ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఆ ప్రాంతం పేరు మీదుగానే కంపెనీకి ‘పార్లే’ అనే పేరు వచ్చింది.
క్యాండీ నుండి బిస్కెట్ వరకు.. పార్లే సంస్థ నుండి వచ్చిన మొదటి ఉత్పత్తి బిస్కెట్ కాదు, అది ఒక ఆరెంజ్ క్యాండీ. బిస్కెట్ల తయారీ సుమారు పదేళ్ల తర్వాత అంటే 1938-39లో ‘పార్లే గ్లూకో’ పేరుతో ప్రారంభమైంది. కాలక్రమేణా అది ‘పార్లే-జీ’గా మారింది. 2011 నాటికి ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న బిస్కెట్‌గా పార్లే-జీ రికార్డు సృష్టించింది.
