ఒడిశాలోని ధేన్‌కనల్ జిల్లా ఇటాప్ గ్రామంలో అనుమానాస్పద ఆహార కలుషితం (Food Poisoning) కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చికెన్ కర్రీ మరియు పాలకూర తిన్న తర్వాత వారి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు, కానీ అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
పాలకూర, చికెన్ రెండూ పోషక విలువలు ఉన్నవే అయినప్పటికీ, సరైన పద్ధతిలో శుభ్రం చేయకపోయినా లేదా ఉడికించకపోయినా అవి ప్రాణాంతకంగా మారతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బెంగళూరులోని HCG క్యాన్సర్ హాస్పిటల్ నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ బి.జె దీనికి గల కారణాలను వివరించారు.
చికెన్ వల్ల కలిగే ముప్పు:
పచ్చి లేదా సరిగ్గా ఉడకని చికెన్‌లో సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్, క్లోస్ట్రిడియం పెర్ఫ్రింజెన్స్ వంటి ప్రమాదకర బ్యాక్టీరియాలు ఉంటాయి. చికెన్ సరిగ్గా ఉడికించకపోయినా, లేదా పచ్చి చికెన్‌ను తాకిన చేతులతో, కత్తులతో ఇతర వస్తువులను ముట్టుకున్నా ఈ ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తుంది. ఇది శరీరంలోని అవయవాలు విఫలమవడానికి (Organ Failure) దారితీసి మరణం సంభవించవచ్చు.
పాలకూరలో దాగిన ప్రమాదాలు:
పాలకూర వంటి ఆకుకూరల్లో ఇ.కోలై, లిస్టెరియా వంటి బ్యాక్టీరియాలు ఉండే అవకాశం ఉంది. కలుషితమైన నీరు లేదా మట్టి వల్ల ఇవి కూరగాయలకు చేరుతాయి. కేవలం నీటితో కడగడం వల్ల ఈ జెర్మ్స్ పూర్తిగా నశించవు.
ఆహారం విషంగా మారడానికి ప్రధాన కారణాలు:
- క్రాస్-కంటామినేషన్ (Cross-Contamination): పచ్చి చికెన్ కోసిన కత్తి లేదా బోర్డునే పాలకూర కోయడానికి వాడటం వల్ల చికెన్ లోని బ్యాక్టీరియా కూరగాయలకు చేరుతుంది.
- అసంపూర్తిగా ఉడికించడం: చికెన్‌ను కనీసం 75°C అంతర్గత ఉష్ణోగ్రత వచ్చే వరకు ఉడికించాలి.
- సరైన నిల్వ లేకపోవడం: వండిన ఆహారాన్ని ఎక్కువ సేపు బయట ఉంచడం వల్ల బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది.
- అపరిశుభ్రత: పచ్చి మాంసం ముట్టుకున్న తర్వాత చేతులను, పాత్రలను సరిగ్గా కడగకపోవడం.
- కుళ్లిన ఆకులను వాడటం: చిరిగిన లేదా కుళ్లిపోయిన పాలకూర ఆకులను వాడటం వల్ల ఇన్ఫెక్షన్ ముప్పు పెరుగుతుంది.
