పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేసిన వ్యక్తి.. ఇప్పుడు 3 రెస్టారెంట్లకు ఓనర్..! 11 ఏళ్లలో జీవితమే మారిపోయింది. ఒకప్పుడు ఇంటింటికీ పిజ్జాలు డెలివరీ చేసిన వ్యక్తికి ఇప్పుడు BMW కారట..!!!

ఆస్ట్రేలియాకు చదువుకోవడానికి వెళ్లిన ఓ భారతీయ యువకుడికి, చదువు పూర్తయిన తర్వాత తన కోర్సుకు సంబంధించిన రంగంలో ఉద్యోగం దొరకలేదు. అయినా నిరాశ చెందకుండా ఓ పిజ్జా షాపులో పూర్తి స్థాయి ఉద్యోగంలో చేరాడు. కస్టమర్ల ఇళ్లకు పిజ్జా డెలివరీ చేయడంతో పాటు ఇతర పనులు చేసేవాడు. సుమారు 11 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రయాణం, ఇప్పుడు అతడిని ఓ వ్యాపారవేత్తగా మార్చేసింది.

దాదాపు మూడేళ్ల పాటు పిజ్జా షాపులో పనిచేసి డబ్బు ఆదా చేసిన అతడు, ఓ భాగస్వామితో కలిసి అదే పిజ్జా బ్రాండ్‌కు చెందిన ఒక ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అతని వ్యాపారం దినదినాభివృద్ధి చెందడం ప్రారంభమైంది. కరోనా కష్టకాలంలోనూ వ్యాపారాన్ని విజయవంతంగా కొనసాగించిన అతడు, ఆ తర్వాత వరుసగా మరో రెండు ఫ్రాంచైజీలను కొనుగోలు చేశాడు. ప్రస్తుతం అతను ఆస్ట్రేలియాలో 3 పిజ్జా రెస్టారెంట్లను నడుపుతున్నట్లు సమాచారం.

వ్యాపారం వృద్ధి చెందడంతో, ఆస్ట్రేలియాలో సొంతిల్లు, BMW కారును కొనుగోలు చేశాడు. హైదరాబాద్‌లో కూడా ఒక ఇల్లు నిర్మించాడని, తన తల్లిదండ్రులను ఆస్ట్రేలియాకు తీసుకెళ్లాడని అతని బంధువు వినీత్ కె సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపాడు. కరోనా సమయంలో భారత్‌కు వచ్చి వివాహం చేసుకున్న అతను, అనంతరం భార్యతో కలిసి ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లాడని ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు.

ఈ క్రమంలో, ఆస్ట్రేలియాలో 11 ఏళ్లు నివసించిన తర్వాత అతనికి, అతని కుటుంబానికి ఇటీవల ఆ దేశ పౌరసత్వం కూడా లభించినట్లు వినీత్ కె వెల్లడించాడు. పిజ్జా డెలివరీ బాయ్ స్థాయి నుంచి ప్రారంభమై నేడు 3 రెస్టారెంట్లకు యజమానిగా ఎదిగిన ఈ యువకుడి స్ఫూర్తిదాయక ప్రయాణం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే, వైరల్ అవుతున్న ఈ సోషల్ మీడియా పోస్ట్‌లోని సమాచారాన్ని మీడియా సంస్థలు స్వతంత్రంగా ధృవీకరించలేదన్నది గమనార్హం.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *