పిడకలతో వచ్చిన తంటా.! “ఇంట్లో పడిన వాటిని తీసుకెళ్లమన్నందుకు ఘోరం”. కొట్టి చంపబడిన వృద్ధుడు.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి జీవిత ఖైదు.. 5 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు..!

హర్యానా రాష్ట్రం సోనిపట్ జిల్లా కాలుపూర్‌లో గాలికి ఎగిరిపడిన పిడకల విషయంలో మొదలైన చిన్న వివాదం వృద్ధుడి హత్యకు దారితీసిన ఘటనలో, ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి కోర్టు జీవిత ఖైదు విధించింది.

2021 జూన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సురేశ్ అనే వ్యక్తికి చెందిన స్థలంలో ఉంచిన పిడకలు బలమైన గాలికి ఎగిరిపోయి, పక్కనే నివసిస్తున్న జగదీశ్ ఇంట్లో పడ్డాయి. వాటిని తీసుకువెళ్లాలని జగదీశ్ కుటుంబ సభ్యులు కోరడంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఆ వివాదం పోలీస్ స్టేషన్ వరకు చేరగా, మరుసటి రోజే పరిస్థితి మరింత దారుణంగా మారింది.

జూన్ 3న జగదీశ్, ఆయన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తుండగా.. సురేశ్, ఆయన సోదరుడు రమేశ్ కుటుంబానికి చెందిన వ్యక్తులు రెండు వాహనాల్లో వచ్చి వారిని అడ్డుకున్నారు. ఇనుప రాడ్లు, కర్రలు, పదునైన ఆయుధాలతో జగదీశ్ కుటుంబంపై దాడికి తెగబడ్డారని ప్రాసిక్యూషన్ పేర్కొంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన జగదీశ్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఆయన భార్య చంద్రా పోలీసులకు ఫిర్యాదు చేయగా, మొత్తం 16 మందిపై కేసు నమోదైంది.

కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సురేశ్, ఆయన భార్య సత్రో, కుమారులు అమిత్, సుమిత్, సోదరుడు రమేశ్, రమేశ్ కుమారుడు సికిందర్‌లను అరెస్ట్ చేశారు. దాదాపు ఐదేళ్ల పాటు సాగిన విచారణ అనంతరం అదనపు జిల్లా సెషన్స్ కోర్టు వీరిని దోషులుగా తేల్చింది. హత్య, నేరపూరిత కుట్ర తదితర సెక్షన్ల కింద అభియోగాలు రుజువైనట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది. నిందితుల కుటుంబ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కనికరం చూపాలని డిఫెన్స్ న్యాయవాది కోరగా, నేర తీవ్రత దృష్ట్యా కఠిన శిక్ష విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు.

ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఇది ఉరిశిక్ష విధించదగిన అరుదైన కేసు కాదని పేర్కొంటూ ఆరుగురికీ జీవిత ఖైదు ఖరారు చేసింది. ఒక్కొక్కరికీ రూ.1,03,500 చొప్పున జరిమానా విధించింది. అలాగే వసూలైన జరిమానా నుంచి మృతుడు జగదీశ్ కుటుంబానికి రూ.1.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. చిన్నపాటి వివాదాలు సైతం హింసకు దారితీస్తే ఎంతటి ఘోర పరిణామాలు ఎదురవుతాయో చెప్పడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలిచింది.


Posted

in

by

Tags: