కేరళలోని కన్నూర్ జిల్లా పయ్యన్నూర్ సమీపంలోని రామంతళిలో ఈ దారుణం జరిగింది. తన పిల్లలను భార్య వద్దకు పంపడం ఇష్టం లేని ఒక వ్యక్తి, తన ఇద్దరు బిడ్డలకు విషమిచ్చి చంపి, తన తల్లితో కలిసి తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఘటన వివరాలు: మృతులను కలాధరన్ (36), అతని తల్లి ఉష (65), కుమార్తె హిమ (6), మరియు కుమారుడు కన్నన్ (2) గా గుర్తించారు. కలాధరన్ వృత్తిరీత్యా షెఫ్ (Chef) గా పనిచేస్తున్నాడు. కలాధరన్ మరియు అతని భార్య గత కొంతకాలంగా విడిగా ఉంటున్నారు. పిల్లలు ఇద్దరూ కలాధరన్ వద్దే ఉండగా, దీనిపై కోర్టులో కేసు నడుస్తోంది. ఇటీవల కోర్టు తీర్పునిస్తూ.. పిల్లల సంరక్షణ బాధ్యతను (Custody) భార్యకు అప్పగించాలని ఆదేశించింది.
ఏం జరిగింది?: కోర్టు తీర్పు ప్రకారం పిల్లలను వెంటనే తమకు అప్పగించాలని భార్య పోలీసులను ఆశ్రయించింది. డిసెంబర్ 23న పిల్లలను తల్లికి అప్పగించాలని పోలీసులు కలాధరన్ తండ్రి ఉన్నికృష్ణన్‌కు ఫోన్ చేసి చెప్పారు. ఈ విషయం తెలిసిన కలాధరన్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. పిల్లలను వదులుకోవడం ఇష్టం లేక, డిసెంబర్ 22 రాత్రి చిన్నారులకు విషమిచ్చి, తన తల్లితో కలిసి ఉరివేసుకున్నాడు. ఆటో డ్రైవర్‌గా పనిచేసే తండ్రి ఉన్నికృష్ణన్ రాత్రి ఇంటికి వచ్చి చూడగా తలుపులు తీయలేదు. అనుమానంతో పోలీసులకు సమాచారం అందించగా, తలుపులు పగులగొట్టి చూడటంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
