ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లోని కలందర్గడి గ్రామంలో కుటుంబ కలహాల కారణంగా ఒక వ్యక్తి తన తండ్రిని, భార్యను తుపాకీతో కాల్చి చంపిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
ఈ హత్య కేసులో అరెస్టయిన మోమిన్ అనే వ్యక్తికి, సనా అనే మహిళతో 2025 ఫిబ్రవరిలో వివాహం జరిగింది. పెళ్లయిన కొద్ది కాలానికే, మోమిన్ తండ్రి రియాజుద్దీన్‌కు, కోడలు సనాకు మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయాన్ని మోమిన్ తల్లి కిష్బర్ కళ్లారా చూసి నిలదీయగా, రియాజుద్దీన్ ఆమెను ఇంట్లో నుండి వెళ్లగొడతానని బెదిరించాడు. దీంతో ఆగ్రహించిన మోమిన్, తన భార్య వాట్సాప్ అకౌంట్‌ను ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసి, తన తండ్రి మరియు భార్య జరుపుకుంటున్న రహస్య సంభాషణలు, వాయిస్ రికార్డింగ్‌లను నిరంతరం పర్యవేక్షించడం మొదలుపెట్టాడు.
ఇలా ఉండగా, మే 10న సనాకు మగబిడ్డ జన్మించాడు. ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చిన సనాతో మోమిన్ గొడవకు దిగి, ఆ బిడ్డ తనకు పుట్టలేదని DNA వివాదాన్ని లేవనెత్తాడు. కుటుంబంలో ఘర్షణ తారాస్థాయికి చేరడంతో, తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన మోమిన్, తన లైసెన్స్ ఉన్న తుపాకీతో తండ్రి రియాజుద్దీన్‌ను, భార్య సనాను కాల్చి చంపాడు.
ఈ దారుణానికి ఒడిగట్టిన తర్వాత, మోమిన్ స్వయంగా పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, నిందితుడు మోమిన్‌ను అరెస్టు చేసి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ఆధారాలుగా ఉన్న వాట్సాప్ చాటింగ్ వివరాలను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపినట్లు పోలీసులు తెలిపారు.
