ఫిఫా ప్రపంచకప్ ఫుట్‌బాల్ మ్యాచ్‌ల ఫైనల్ చూడటం కోసం, పనిచేసే సంస్థలో ఒక ఉద్యోగి వేసిన ప్లాన్, సోషల్ మీడియా రీల్స్ వీడియో వల్ల తిరగబడింది.
సాధారణంగా ఉద్యోగానికి వెళ్లే వ్యక్తులు సెలవు తీసుకోవడానికి రకరకాల కారణాలు చెప్పడం పరిపాటే. అయితే, ఒక ఉద్యోగి ప్రపంచకప్ ఫుట్‌బాల్ మ్యాచ్ చూడటానికి నెల రోజుల ముందే ప్లాన్ చేసి తీసుకున్న సెలవు, ఒకే ఒక్క ఇన్స్టాగ్రామ్ వీడియో వల్ల రద్దయిన సంఘటన ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
రెడ్డిట్ వేదికగా పంచుకున్న సమాచారం ప్రకారం, ఆ ఉద్యోగి గత ఒక నెల రోజులుగా వరుసగా సెలవులు తీసుకుంటూ వచ్చాడు. మేనేజర్ దీనిపై ప్రశ్నించడంతో, సెలవులు తగ్గించి ప్రతిరోజూ ఆఫీస్‌కు ఆలస్యంగా రావడం ప్రారంభించాడు. మేనేజర్ అడిగినప్పుడల్లా తీవ్రమైన ట్రాఫిక్ జామ్ అనే సాధారణ కారణం చెప్పి తప్పించుకునేవాడు. అయితే, మరొక మేనేజర్ “వీడు రాత్రంతా ప్రపంచకప్ మ్యాచ్‌లు చూసి ఉదయాన్నే ఆలస్యంగా వస్తున్నాడు” అని సరదాగా అనడం, ప్రధాన మేనేజర్‌కు అనుమానాన్ని రేకెత్తించింది.
అనుమానం వచ్చిన మేనేజర్, ఆ ఉద్యోగి ఆలస్యంగా వచ్చిన రోజులను, అతను సెలవు తీసుకున్న రోజులను ప్రపంచకప్ ఫుట్‌బాల్ మ్యాచ్‌ల షెడ్యూల్‌తో పోల్చి చూశాడు. అప్పుడే, ఫ్రాన్స్, పోర్చుగల్, అర్జెంటీనా వంటి ప్రధాన జట్లు తలపడిన మ్యాచ్‌లు జరిగిన రోజుల్లోనే ఆ ఉద్యోగి సెలవు తీసుకోవడం, ఆలస్యంగా రావడం తెలిసివచ్చింది. ఇదిలా ఉండగా, రాబోయే ఫిఫా ఫైనల్ మ్యాచ్ చూడటానికి, సోమవారం నాడు “కుటుంబ శుభకార్యం” అని కారణం చెప్పి నెల రోజుల ముందే అతను సెలవుకు అనుమతి కూడా పొంది ఉన్నాడు.
అంతా ప్లాన్ ప్రకారమే ముగిసిందనుకున్న సమయంలో, వీకెండ్లో మేనేజర్ ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక రీల్స్ వీడియో కనిపించింది. అందులో ఒక పాఠశాల ప్రిన్సిపాల్, ఫిఫా ఫైనల్ మ్యాచ్‌ను పురస్కరించుకుని సోమవారం పాఠశాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ వీడియో చూసిన మేనేజర్‌కు తన ఉద్యోగి సోమవారం నాటి సెలవుపై అనుమానం బలపడింది. తక్షణమే ఉద్యోగిని సంప్రదించిన మేనేజర్, “కుటుంబ శుభకార్యం అయితే పెళ్లి పత్రిక లేదా రైలు టికెట్ పంపు” అని అడగ్గా, ఉద్యోగి వద్ద ఎలాంటి ఆధారం లేదు. వెంటనే మేనేజర్ ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లింక్ పంపి, “నన్ను మోసం చేయలేవు, సోమవారం ఉదయం 9 గంటలకు ఆఫీస్‌లో ఉండాలి” అని ఉత్తర్వులు జారీ చేస్తూ సెలవును రద్దు చేశాడు. ఈ ఆసక్తికరమైన సంఘటన ప్రస్తుతం ఇంటర్నెట్లో చర్చనీయాంశంగా మారింది.
