బ్యాంకింగ్ రంగం పూర్తిగా డిజిటల్ అయిపోయిందని మీరు భావిస్తే అది పొరపాటే. ఇప్పటికీ బ్యాంకుల్లో పేపర్లు, పెన్నులతో కూడిన స్టేషనరీ వస్తువుల కోసం ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి.
అవును, దేశంలోని ప్రముఖ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), హెచ్డీఎఫ్సీ (HDFC), యాక్సిస్ (Axis), ఐసీఐసీఐ (ICICI)తో సహా మొత్తం 14 బ్యాంకులు గత 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేవలం పేపర్లు, పెన్నులు, పెన్సిళ్లు వంటి స్టేషనరీ వస్తువుల కోసమే ఏకంగా రూ. 3,877 కోట్లు ఖర్చు చేశాయి. ఈ జాబితాలో ఎస్బీఐ మొదటి స్థానంలో నిలిచింది. ఈ బ్యాంకు తన మొత్తం లాభంలో 1.22 శాతాన్ని, అంటే రూ. 986.4 కోట్లను కేవలం స్టేషనరీ కోసమే వెచ్చించింది. మరి ఏయే బ్యాంకులు ఎంతెంత ఖర్చు చేశాయో పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.
ప్రస్తుతం బ్యాంకులు వేగంగా డిజిటలైజ్ అవుతున్నాయి. మనం కూడా బ్యాంకుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఆన్లైన్ ద్వారానే మెజారిటీ సేవలను పొందుతున్నాం. రాబోయే కొద్ది సంవత్సరాల్లో బ్యాంకులు పూర్తిగా పేపర్‌లెస్ డిజిటల్ వ్యవస్థగా మారే అవకాశాలు ఉన్నాయి.
అయినప్పటికీ, బ్యాంకుల్లో నేటికీ పేపర్లు, పెన్నులు, పెన్సిళ్లతో కూడిన ఇతర స్టేషనరీ వస్తువుల వినియోగం నిరంతరం కొనసాగుతూనే ఉంది. కేవలం వీటి కోసమే 2025-26లో 14 బ్యాంకులు కలిసి మొత్తం రూ. 3,877 కోట్లు ఖర్చు చేశాయంటే నమ్మడం కాస్త కష్టమే, కానీ ఇది పూర్తిగా నిజం.
2025-2026 ఆర్థిక సంవత్సరంలో ప్రింటింగ్ మరియు స్టేషనరీ కోసం ప్రతి బ్యాంకు ఎంతెంత మొత్తం ఖర్చు చేసిందనే వివరాలను ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫారమ్ ‘గ్రో’ (Groww) విడుదల చేసింది. క్యాష్ బుక్స్, పాస్ బుక్స్, అకౌంట్ స్టేట్మెంట్లు, దరఖాస్తు ఫారాలు మరియు ఇతర స్టేషనరీ అవసరాల కోసం ఈ కోట్ల రూపాయలను వెచ్చించారు.
ఏ బ్యాంకు ఎంత ఖర్చు చేసిందంటే? (టాప్ 14 బ్యాంకుల జాబితా):
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI): ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో స్టేషనరీ కోసం రూ. 986.4 కోట్లు ఖర్చు చేసింది. ఇది బ్యాంకు మొత్తం లాభంలో 1.22 శాతానికి సమానం.
- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC): రెండో స్థానంలో ఉన్న ఈ బ్యాంకు మొత్తం రూ. 922.5 కోట్లు ఖర్చు చేసింది. ఇది బ్యాంకు లాభంలో 1.26 శాతం.
- యాక్సిస్ బ్యాంక్ (Axis): మూడో స్థానంలో నిలిచిన యాక్సిస్ బ్యాంక్ రూ. 373.8 కోట్లు ఖర్చు చేసింది. ఇది బ్యాంకు లాభంలో 1.33 శాతం.
- ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI): నాల్గో స్థానంలో ఉన్న ఈ బ్యాంకు మొత్తం రూ. 318.5 కోట్లు ఖర్చు చేసింది. ఇది బ్యాంకు మొత్తం లాభంలో 0.58 శాతం మాత్రమే.
- బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB): ఐదో స్థానంలో ఉన్న ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు రూ. 211.9 కోట్లు ఖర్చు చేసింది. ఇది బ్యాంకు మొత్తం లాభంలో 1.02 శాతం.
- పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB): రూ. 173.8 కోట్లు ఖర్చు చేసింది. ఇది బ్యాంకు మొత్తం లాభంలో 0.94 శాతంగా ఉంది.
- కోటక్ మహీంద్రా బ్యాంక్: ఈ బ్యాంకు రూ. 167 కోట్లు ఖర్చు చేసింది. ఇది బ్యాంకు మొత్తం లాభంలో 0.75 శాతం.
- కెనరా బ్యాంక్: ఎనిమిదో స్థానంలో ఉన్న కెనరా బ్యాంక్ మొత్తం రూ. 165.9 కోట్లు వెచ్చించింది. ఇది మొత్తం లాభంలో 0.94 శాతం.
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఈ బ్యాంకు రూ. 135.3 కోట్లు ఖర్చు చేసింది. ఇది బ్యాంకు మొత్తం లాభంలో 0.75 శాతం.
- ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC First): ఈ బ్యాంకు రూ. 122.7 కోట్లు ఖర్చు చేసింది. ఇది దాని మొత్తం లాభంలో ఏకంగా 8.05 శాతంగా నమోదైంది.
- ఇండస్ఇండ్ బ్యాంక్ (IndusInd): రూ. 114.9 కోట్లు ఖర్చు చేసింది. ఇది బ్యాంకు మొత్తం లాభంలో 4.46 శాతం.
- యెస్ బ్యాంక్ (Yes Bank): స్టేషనరీ కోసం రూ. 70.0 కోట్లు ఖర్చు చేసింది. ఇది మొత్తం లాభంలో 2.86 శాతం.
- ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: ఈ బ్యాంకు రూ. 58.3 కోట్లు ఖర్చు చేసింది. ఇది బ్యాంకు మొత్తం లాభంలో 2.77 శాతం.
- ఫెడరల్ బ్యాంక్: చివరిగా 14వ స్థానంలో ఉన్న ఫెడరల్ బ్యాంక్ మొత్తం రూ. 56.2 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదిక పేర్కొంది. ఇది ఆ బ్యాంకు మొత్తం లాభంలో 1.33 శాతానికి సమానం.
