వివాహమైన భార్యాభర్తల మధ్య ఎటువంటి అనురాగం లేకుండా, ఒకే ఇంట్లో కలిసి జీవించలేని పరిస్థితి ఏర్పడితే ఆ జీవితం నరకంతో సమానమే.
అలాంటి పరిస్థితుల్లో ఇద్దరూ విడివిడిగా జీవించడాన్ని మానసిక క్షోభగా పరిగణించి విడాకులు మంజూరు చేయవచ్చని న్యాయస్థానాలు తీర్పులు ఇస్తున్నాయి. ఈ క్రమంలో పాట్నా హైకోర్టు వెలువరించిన ఒక తీర్పు ప్రస్తుతం న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ కేసుకు సంబంధించి, బీహార్లోని పాట్నా నగరంలో 2013 జనవరి 23న వీరి వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా జన్మించాడు. అయితే, కొద్ది కాలంలోనే వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో మనస్తాపానికి గురైన భార్య, తన బిడ్డతో సహా భర్త ఇంటిని విడిచిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది.
భర్త తరఫున వాదిస్తూ.. “భార్య నాతో, నా కుటుంబసభ్యులతో సరిగ్గా ప్రవర్తించలేదు. ఎన్నోసార్లు పిలిచినా నాతో కలిసి కాపురం చేయడానికి నిరాకరించింది” అని పేర్కొంటూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. మరోవైపు భార్య వాదిస్తూ.. “భర్త, ఆయన కుటుంబసభ్యులు నన్ను శారీరకంగా, మానసికంగా వేధించారు” అని ఆరోపించింది.
ఈ కేసును విచారించిన హైకోర్టు, భర్త యొక్క నెలవారీ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని, భార్యకు శాశ్వత భరణం (జీవనభృతి) కింద రూ. 36.25 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా, ఈ మొత్తాన్ని తీర్పు వెలువడిన తేదీ నుంచి మూడు నెలల్లోపు రెండు సమాన వాయిదాలలో భార్య బ్యాంకు ఖాతాలో జమ చేయాలని భర్తను న్యాయస్థానం ఆదేశించింది.

Leave a Reply