ముంబైలోని జుహు ప్రాంతంలో బీఎండబ్ల్యూ కారు నడుపుతున్న ఓ మహిళ సృష్టించిన హంగామాకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. వరుసగా వాహనాలను ఢీకొట్టిన అనంతరం అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఆమెను అడ్డుకున్న ట్రాఫిక్ పోలీస్ అధికారిని కూడా కారుతో ఢీకొట్టేందుకు యత్నించినట్లు వీడియోలో కనిపిస్తోంది.
వీడియోలో ఓ ట్రాఫిక్ పోలీస్ అధికారి కారు ముందు నిలబడి వాహనాన్ని ఆపాలని పదేపదే కోరుతున్నారు. అయితే ఆ మహిళ ఆయన మాటలను పట్టించుకోకుండా ట్రాఫిక్ మధ్యలో కారును ముందుకు కదిలిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
ఈ బీఎండబ్ల్యూ కారు జుహు ప్రాంతంలో ఓ స్కూటర్, ఓ మోటార్ సైకిల్‌తో పాటు మరో కారును ఢీకొట్టినట్లు కథనంలో పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా కారు ఆపకుండా వెళ్లిపోయేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. చివరకు రోడ్డుపై ఉన్న ఓ మహిళ కారు వెనుక డోర్ తెరవడంతో డ్రైవింగ్ చేస్తున్న మహిళ వాహనాన్ని ఆపినట్లు తెలుస్తోంది.
కారు ఆపిన తర్వాత ఆమె తన మొబైల్ ఫోన్ తీసి అక్కడున్న వారిని వీడియో తీయడం ప్రారంభించారు. చుట్టూ ఉన్నవారంతా తనను చుట్టుముట్టి వేధిస్తున్నారంటూ ఆరోపించినట్లు కథనం పేర్కొంది. ఆ తర్వాత మరోసారి కారును ముందుకు నడిపిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయిన దృశ్యాలు మరో వీడియోలో కనిపించినట్లు సమాచారం.
అయితే ఈ ఘటనకు సంబంధించి కారు నడిపిన మహిళ గుర్తింపు, ప్రమాదానికి దారితీసిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. పోలీసులు కేసు నమోదు చేశారా? ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే విషయాలపైనా స్పష్టత లేదు.
