ప్రజలారా జాగ్రత్త..! చెన్నైలో పెరుగుతున్న ‘కాల్ ఫార్వార్డింగ్’ మోసాలు..!

చెన్నై మరియు దేశంలోని వివిధ ప్రాంతాలలో ‘కాల్ ఫార్వార్డింగ్’ అనే వినూత్నమైన సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. డెలివరీ ఏజెంట్ల ముసుగులో వచ్చి మీ బ్యాంక్ ఖాతాలోని డబ్బును కాజేయడమే ఈ మోసగాళ్ల ప్రధాన లక్ష్యం. ఈ మోసం గురించి సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

మోసం జరిగే విధానం: ఈ మోసగాళ్లు సాధారణంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లేదా బ్లూ డార్ట్ వంటి ప్రముఖ కంపెనీల డెలివరీ ఏజెంట్లమని పరిచయం చేసుకుంటూ మీకు ఫోన్ చేస్తారు. “మీ పార్సెల్ దెబ్బతింది”, “మీ అడ్రస్ సరిగ్గా లేదు”, లేదా “మీ పార్సెల్ డెలివరీ చేయడం సాధ్యపడటం లేదు” అని నమ్మిస్తారు. ఆ పార్సెల్‌ను క్యాన్సిల్ చేయడానికి లేదా మా పై అధికారులతో మాట్లాడటానికి అంటూ ఒక USSD కోడ్‌ను డయల్ చేయమని చెబుతారు.

ఉదాహరణకు.. మీ మొబైల్‌లో *123# లేదా *401* [ఒక మొబైల్ నంబర్]# వంటి కోడ్‌లను డయల్ చేయమంటారు. మీరు ఆ నంబర్‌ను డయల్ చేసిన మరుక్షణమే, మీ మొబైల్‌కు వచ్చే కాల్స్ అన్నీ రహస్యంగా మోసగాళ్ల నంబర్‌కు మళ్లించబడతాయి (Forward అవుతాయి).

దీని ద్వారా మీ బ్యాంక్ లావాదేవీలను పర్యవేక్షిస్తూ, బ్యాంక్ నుండి మాట్లాడుతున్నామని చెప్పి మిమ్మల్ని బురిడీ కొట్టించి OTP అడుగుతారు. ఒకవేళ మీరు ఆ OTP చెబితే, మీ అకౌంట్‌లో ఉన్న డబ్బు మొత్తం మాయం చేస్తారు. అంతేకాకుండా, మీ వాట్సాప్ ఖాతాను కూడా హ్యాక్ చేసి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంది.

కాల్ ఫార్వార్డింగ్‌ను ఎలా నిరోధించాలి? మీ ఫోన్‌లో కాల్ ఫార్వార్డింగ్ ఆక్టివ్‌గా ఉందో లేదో తెలుసుకోవడానికి మరియు దానిని నిలిపివేయడానికి ఈ క్రింది కోడ్‌లను వాడండి:

  • తనిఖీ చేయడానికి: మీ ఫోన్ నుండి *#21# లేదా *#62# డయల్ చేయండి. ఒకవేళ వేరే నంబర్‌కు కాల్స్ వెళ్తున్నట్లు చూపిస్తే జాగ్రత్తపడండి.
  • రద్దు చేయడానికి (Deactivate): అన్ని రకాల కాల్ ఫార్వార్డింగ్ సేవలను తక్షణమే నిలిపివేయడానికి ##002# డయల్ చేయండి.

సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక:

  • తెలియని వ్యక్తులకు ఫోన్ ద్వారా మీ OTP లేదా వ్యక్తిగత వివరాలు చెప్పకండి.
  • ఎవరైనా డెలివరీ ఏజెంట్లమని చెప్పి మీ ఫోన్‌లో కోడ్‌లు డయల్ చేయమంటే ఖచ్చితంగా చేయకండి.
  • ఒకవేళ మీరు మోసపోయినట్లు గుర్తిస్తే, వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయండి.

Posted

in

by

Tags: