ఏదైనా ఒక గ్రామం రాత్రికి రాత్రే తన దేశాన్ని మార్చుకుంటుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఇది సినిమా కథ కాదు, లడఖ్‌లోని తుర్తుక్ (Turtuk) గ్రామంలో జరిగిన యదార్థ సంఘటన. ఇక్కడి ప్రజలు 1971 డిసెంబర్ 14 రాత్రి పాకిస్థాన్‌లో నిద్రపోయారు, కానీ మరుసటి రోజు ఉదయం భారత్‌లో మేల్కొన్నారు.
పాకిస్థాన్ ఆక్రమణ నుండి విముక్తి పొందిన ఈ గ్రామం నేడు భారతదేశంలో అంతర్భాగం. ఒకప్పుడు పీఓకే (PoK)లో భాగంగా ఉన్న తుర్తుక్, ప్రస్తుతం లడఖ్‌లోని నుబ్రా వ్యాలీలో ప్రశాంతమైన పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ గ్రామం వెనుక ఉన్న అసలు కథ ఇదే..
భారత సైన్యం సాహసం: 1971 భారత్-పాక్ యుద్ధ సమయంలో, భారత సైన్యం లడఖ్ స్కౌట్స్ సహాయంతో తుర్‌తుక్‌ను స్వాధీనం చేసుకుంది. మేజర్ చేవాంగ్ రించెన్ నాయకత్వంలోని భారత సైనికులు ఎటువంటి కాల్పులు లేకుండానే గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పాకిస్థాన్ సైనికులు రాత్రికి రాత్రే పారిపోయారు. ఉదయం గ్రామానికి చేరుకున్న మేజర్ రించెన్, భయంతో ఉన్న గ్రామస్థులకు భరోసా ఇచ్చారు. “భారత సైన్యం మీకు రక్షణగా ఉంటుంది. మీ మహిళలను, పిల్లలను తిరిగి పిలవండి. వారు మాకు తల్లులు, సోదరీమణులతో సమానం” అని ఆయన హామీ ఇచ్చారు. అలా తుర్తుక్, త్యాక్షి, చాలుంకా, థాంగ్ వంటి నాలుగు గ్రామాలు రాత్రికి రాత్రే భారత్‌లో చేరిపోయాయి.
శాంతిప్రియులైన ప్రజలు: మొత్తం 800 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని భారత్ విముక్తి చేసింది. తుర్తుక్ ప్రజలు ‘బాల్టి’ తెగకు చెందినవారు. వీరి భాష, సంస్కృతి పాకిస్థాన్‌లోని బాల్టిస్తాన్ ప్రాంతాన్ని పోలి ఉంటాయి. 1971కి ముందు ఇక్కడ పాక్ పాఠ్యప్రణాళికను బోధించేవారు. యుద్ధం తర్వాత అన్నీ మారిపోయాయి. మొదట ప్రజలు భయపడినప్పటికీ, భారత సైన్యం ఇచ్చిన ప్రోత్సాహంతో ఇప్పుడు గర్వంగా తాము భారత పౌరులమని చెప్పుకుంటున్నారు. 1999 కార్గిల్ యుద్ధంలో కూడా ఇక్కడి ప్రజలు భారత సైన్యానికి అండగా నిలిచారు.
నేటి తుర్తుక్: నేటి ఆధునిక ప్రపంచానికి తుర్తుక్ చాలా దూరంగా ఉంటుంది. ఇక్కడ విద్యుత్ పరిమితంగా ఉంటుంది, వై-ఫై సౌకర్యం లేదు, కానీ జీవనం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడి ప్రజలు ప్రధానంగా ఖుబానీ (Apricots) తోటలపై ఆధారపడతారు. తుర్తుక్ ఖుబానీలు లడఖ్ అంతటా ప్రసిద్ధి. చేతితో నేసిన ఉన్ని బట్టలు, సాంప్రదాయ బాల్టి వంటకాలు ఇక్కడి ప్రత్యేకత. పర్యాటకులు ఇక్కడ బాల్టి సంస్కృతిని చూస్తూ, ష్యోక్ నది తీరాన విహరిస్తూ గడుపుతుంటారు.
