బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్లో గురువారం ఎస్ఐఆర్ (SIR – స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) అనే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియకు వ్యతిరేకంగా జరిగిన నిరసన తీవ్ర కలకలం రేపింది.
సీజేపీ (CJP) నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, నటుడు ప్రకాష్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. నిరసనకారులు “ఓట్ చోర్, గద్దీ ఛోడో” తదితర నినాదాలు చేయగా, ధ్రువ్ రాఠీ పంచుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం లేవని ధ్రువ్ రాఠీ ఆరోపించారు. ఎన్నికల సంఘం పనితీరును ప్రశ్నించిన ఆయన.. తమ పోరాట ఉద్దేశం అధికార మార్పిడి కాదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో, ఈ నిరసనలో మహిళలు, విద్యార్థులతో సహా వివిధ వర్గాల ప్రజలు పాల్గొని, ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడంపై తమ వ్యతిరేకతను తీవ్రంగా వ్యక్తం చేశారు. “మమ్మల్ని తుడిచివేయకండి, మా గొంతు వినండి” అని రాసి ఉన్న ప్లకార్డులు కూడా ఈ నిరసనలో కనిపించాయి.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ డిప్కే తెలిపారు. ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ నిర్దిష్ట రాజకీయ మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని వారి ఓటు హక్కును హరించేలా ఉందని ఆయన ఆరోపించారు. నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఎస్ఐఆర్ను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఇది కేవలం ఓట్ల తొలగింపు వ్యవహారం మాత్రమే కాదని, పౌరుల హక్కులు, గౌరవానికి సంబంధించిన సమస్య అని వ్యాఖ్యానించారు.
