ప్రపంచంలోనే ఇలాంటి నగరం మరొకటి లేదు: ఇక్కడ మాంసం తినరు, అమ్మరు.. కనీసం ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా దొరకవు!

ప్రపంచంలో ఒక నగరం ఉంది, అక్కడ ఎవరూ మాంసాహారం తినరు, తయారు చేయరు, ఇక అమ్మే ప్రసక్తే లేదు. ఈ నగరంలో మాంసాహారంపై పూర్తి నిషేధం ఉంది. ఇక్కడ మీరు మాంసాహారం తినలేరు, అమ్మలేరు, కనీసం నిల్వ కూడా చేయలేరు.

ఆ నగరం మరెక్కడో కాదు, మన భారతదేశంలోని గుజరాత్‌లో ఉంది. దాని పేరు ‘పాలితానా’. ఇది ఒక జైన మతపరమైన నగరం. రాష్ట్ర ప్రభుత్వం దీనిని పూర్తిగా శాకాహార నగరంగా ప్రకటించింది.

నగరం విశిష్టత: పాలితానా 900కు పైగా జైన దేవాలయాల కారణంగా “జైన్ టెంపుల్ టౌన్”గా ప్రసిద్ధి చెందింది. ఈ నగరం అహింసా సిద్ధాంతాన్ని పాటిస్తుంది. గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ పట్టణానికి ఏటా లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు వస్తుంటారు.

మాంసం, చేపలు, గుడ్లపై పూర్తి నిషేధం: జైన మతంలో అహింస అనేది ప్రధాన సూత్రం. 2014లో జైన మునుల అభ్యర్థన మేరకు, గుజరాత్ ప్రభుత్వం పాలితానాను “శాకాహార నగరంగా” (Vegetarian City) ప్రకటించింది. ఇక్కడ కసాయి ఖానాలు (Slaughterhouses), నాన్-వెజ్ రెస్టారెంట్లు లేవు. పర్యాటకులు కూడా నగరంలోకి మాంసాహారాన్ని తీసుకురాకూడదు.

శ్వేతాంబర జైనుల ప్రధాన తీర్థయాత్ర: శత్రుంజయ కొండపై సుమారు 900 దేవాలయాలు ఉన్నాయి, వీటిని “సిద్ధక్షేత్ర” (మోక్షం పొందే స్థలం) అని పిలుస్తారు. 11వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం వరకు నిర్మించిన ఈ దేవాలయాలు అద్భుతమైన వాస్తుశిల్పానికి, పాలరాతి శిల్పకళకు నిదర్శనం. కొండపై ఉన్న ఆలయాలకు చేరుకోవడానికి సుమారు 3,500 మెట్లు ఎక్కాలి.

జనాభా మరియు జీవనశైలి: పాలితానా జనాభా సుమారు 65,000. ఇందులో 60% జైన సంఘం, 35% హిందువులు, 5% ముస్లింలు మరియు ఇతర వర్గాల వారు ఉంటారు. ఇక్కడ నివసించే ముస్లింలు కూడా స్థానిక ఆచారాలను గౌరవిస్తూ బహిరంగంగా మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఆర్థిక వ్యవస్థ మొత్తం భక్తుల పర్యాటకంపైనే ఆధారపడి ఉంటుంది.

ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా దొరకవు: ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇక్కడ ఉల్లిపాయలు, వెల్లుల్లి అమ్మకం మరియు వినియోగంపై కూడా నిషేధం ఉంది. స్థానిక మార్కెట్లలో ఇవి దొరకవు. ఒకవేళ కావాలంటే పక్కనే ఉన్న భావ్‌నగర్ వంటి నగరాలకు వెళ్లాల్సిందే.

ఇతర ప్రాంతాలు: ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్, హరిద్వార్, అలాగే అయోధ్య, బృందావనం వంటి పుణ్యక్షేత్రాలలో కూడా సంప్రదాయబద్ధంగా మాంసం, మద్యంపై ఆంక్షలు ఉంటాయి. కానీ, పాలితానాలో ఉన్నట్లుగా అక్కడ చట్టబద్ధమైన (Legal) నిషేధం లేదు.


Posted

in

by

Tags: