ప్రపంచ పటంలో ప్రత్యేక దేశంగా గుర్తించబడకపోయినప్పటికీ, యెమెన్‌లో ఎక్కువ భాగాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకుని, ప్రపంచ దేశాల నిద్రను చెడగొడుతున్న సమూహమే ‘హూతీలు’.
తమ్మను ‘అన్సార్ అల్లా’ అని పిలుచుకునే ఈ సంస్థ, ఇటీవల ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ‘బాబ్ అల్-మండెబ్’ జలసంధిని హస్తగతం చేసుకుని భారీ యుద్ధ ఉద్రిక్తతను సృష్టించింది.
1990లలో హుస్సేన్ అల్-హూతీ అనే నాయకుడిచే ప్రారంభించబడిన ఈ ఉద్యమం, యెమెన్ ఉత్తర ప్రాంతంలోని ‘జైదీ షియా’ ముస్లిం సమాజ హక్కుల కోసం ఏర్పడింది. ప్రభుత్వ అవినీతి, పాశ్చాత్య దేశాల జోక్యానికి వ్యతిరేకంగా పోరాడిన వీరు.. 2014లో యెమెన్ రాజధాని సనాను ఆక్రమించి, సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఒక శక్తివంతమైన సైనిక శక్తిగా అవతరించారు.
మధ్య ప్రాచ్యంలో అమెరికా, సౌదీ అరేబియా ఆధిక్యాన్ని వ్యతిరేకించే హూతీలకు ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో సహా ఆధునిక ఆయుధ సహాయాన్ని అందిస్తోంది. దీంతో సౌదీ అరేబియాతో తీవ్ర యుద్ధంలో నిమగ్నమైన హూతీలు, ప్రస్తుతం సౌదీ చమురు నౌకలను దిగ్బంధించి ప్రపంచ మార్కెట్‌ను స్తంభింపజేశారు.
హూతీల హఠాత్తు దాడుల వల్ల ఎర్ర సముద్రం గుండా నౌకలు వెళ్ళలేక ప్రపంచ వాణిజ్యం స్తంభించిపోయింది. దీనివల్ల అంతర్జాతీయంగా ముడిచమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటగా, యెమెన్ నుండి వేలాది మంది ప్రజలు శరణార్థులుగా తరలిపోతున్నారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.
ఇరాన్ మద్దతుతో బాలిస్టిక్ క్షిపణులు, గెరిల్లా పోరాట పద్ధతుల్లో ప్రావీణ్యం సంపాదించిన హూతీలను అమెరికా, సౌదీ కూటములు కూడా సులభంగా నియంత్రించలేకపోతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే శాసించే స్థాయికి చేరిన ఈ హూతీ తిరుగుబాటుదారుల చర్యలు మధ్యప్రాచ్యంలో మరొక పెద్ద యుద్ధానికి బీజం వేశాయి.

Leave a Reply