ప్రపంచ మార్కెట్ గతి మారబోతోంది.. బంగారం ‘పంచ తంత్రం’.. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ బద్దలు కొట్టిన రహస్యం!

2025లో రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు, 2026లో కూడా అదే వేగంతో దూసుకుపోతాయని అంచనా. ఇప్పటికే భారత మార్కెట్లో (MCX) బంగారం ధర రూ. 2,000 పైగా పెరిగి ₹1.38 లక్షల మార్కును తాకింది. ఈ ఆకస్మిక పెరుగుదల సామాన్య కొనుగోలుదారులను, ఇన్వెస్టర్లను అయోమయంలో పడేసింది.

బంగారం ధరలు ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయి? దీని వెనుక ఉన్న కారణాలేంటి? అనే విషయాలను వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) తన తాజా నివేదికలో స్పష్టంగా వివరించింది.

ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు:

  1. నమ్మకమైన ఆస్తి: ప్రపంచ రాజకీయాల్లో అస్థిరత పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. ప్రస్తుతం అమెరికా డాలర్ తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద రిజర్వ్ ఆస్తి బంగారమే. ముఖ్యంగా వెనిజులాపై అమెరికా జరిపిన సైనిక చర్య కారణంగా నెలకొన్న ఉద్రిక్తతలు బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణమయ్యాయి.
  2. రికార్డు స్థాయి ట్రేడింగ్: 2025 మొదటి అర్ధభాగంలో రోజువారీ సగటు బంగారం వ్యాపారం 329 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుందని WGC తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు, సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న బంగారం మొత్తం విలువ 5.1 ట్రిలియన్ డాలర్లకు చేరింది.
  3. స్థిరమైన రాబడి: గత 50 ఏళ్లుగా బంగారం ధర సగటున ఏడాదికి 8% చొప్పున పెరుగుతోంది. ఇది స్టాక్ మార్కెట్ రాబడులతో పోటీ పడుతూ, బాండ్ల కంటే మెరుగైన ఫలితాలను ఇస్తోంది. అందుకే దీర్ఘకాలిక పెట్టుబడికి బంగారం అత్యంత సురక్షితమైనది.
  4. పునర్వినియోగం (Recycling): బంగారం ప్రత్యేకత ఏంటంటే.. ఇది పూర్తిగా రీసైకిల్ చేయదగిన లోహం. ఇప్పటివరకు భూమి నుండి తీసిన ప్రతి ఔన్సు బంగారం ఏదో ఒక రూపంలో (నగలు, వైద్య పరికరాలు, టెక్నాలజీ) ఇంకా వాడుకలో ఉండటం విశేషం.
  5. పరిమితి: బంగారం నుండి నెలవారీ ఆదాయం (వడ్డీ లేదా అద్దె రూపంలో) రాదు. ధర పెరిగిన తర్వాత దానిని విక్రయిస్తేనే లాభం వస్తుంది. ఇది ఒక లోపంగా కొందరు ఆర్థిక నిపుణులు భావిస్తారు.

నిపుణుల హెచ్చరిక: ఆర్థిక మాంద్యం భయాలు, ద్రవ్యోల్బణం మరియు రాజకీయ ఉద్రిక్తతల వల్ల బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే, బంగారాన్ని తక్షణ లాభాల కోసం కాకుండా దీర్ఘకాలిక పెట్టుబడిగా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.


Posted

in

by

Tags: