మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్లో 3 నెలల గర్భిణి అయిన కవితా చౌదరి మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
మొదట ఇది రోడ్డు ప్రమాదంగా భావించినప్పటికీ, పోలీసుల విచారణలో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కవితను హత్య చేసేందుకు ఆమె భర్త ప్రయాస్ పాండే పథకం పన్నినట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందని సమాచారం. ఈ ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
గత సెప్టెంబర్ 4వ తేదీ రాత్రి రోడ్డు పక్కన గుర్తు తెలియని మహిళ మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అనంతరం నిర్వహించిన పోస్టుమార్టంలో ఆ మహిళ 3 నెలల గర్భిణి అని తేలింది. దీంతో పోలీసులు ప్రమాదం అనే కోణాన్ని దాటి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, సెల్ ఫోన్ నంబర్లను బట్టి విచారణ చేయగా, కొందరు అనుమానితులు పోలీసుల దృష్టికి వచ్చారు.
దీంతో విక్రమ్ అహిర్వార్, ధనిరామ్ అలియాస్ కారియా, రాంజీ చౌదరి అనే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో.. కవిత ప్రయాణిస్తున్న స్కూటీని పికప్ వాహనంతో ఢీకొట్టి, దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేలా ప్లాన్ చేసినట్లు నిందితులు చెప్పారని పోలీసులు తెలిపారు. ఈ కుట్ర వెనుక కవిత భర్త ప్రయాస్ పాండే, అతని అనుచరుడు మాన్సింగ్ లోధి ఉన్నట్లు విచారణలో తేలిందని సమాచారం. హత్య చేసేందుకు ఈ ముగ్గురికీ సుమారు రూ.60,000 నుంచి రూ.70,000 వరకు డబ్బు (సుపారీ) ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.
అంతేకాకుండా, కవిత పేరు మీద మొత్తం రూ.1.15 కోట్లకు పైగా బీమా (ఇన్సూరెన్స్) పాలసీలు ఉన్నట్లు విచారణలో తేలింది. దీంతో ఆ ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఈ హత్యకు కుట్ర పన్నారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అరెస్టు చేసిన ముగ్గురి వద్ద నుంచి పికప్ వాహనాన్ని సీజ్ చేయగా, ప్రధాన నిందితులైన భర్త ప్రయాస్ పాండే, మాన్సింగ్ లోధి పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు. వారిని పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Leave a Reply