హత్రాస్: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో మంగళవారం ఒక 65 ఏళ్ల వ్యక్తిని, అతని చిన్న కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన పెద్ద కుమారుడు మరియు అతని భార్య క్రైస్తవ మతంలోకి మారారనే అనుమానంతో వారిని బహిరంగంగా అవమానించి, ఇంటి నుండి గెంటివేసినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి.
స్థానికుల కథనం ప్రకారం.. 65 ఏళ్ల శివరాజ్ సింగ్ సోమవారం నాడు గ్రామ పంచాయితీని ఏర్పాటు చేసి, తన కుమారుడి కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించాలని డిమాండ్ చేశాడు. అంతేకాకుండా ఆ దంపతులకు బహిరంగంగా చెప్పుల దండ వేసి బలవంతంగా ఊరేగించాడు.
గ్రామానికి తిరిగి వచ్చిన బలరామ్ కుటుంబం: ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై పోలీసులు కూడా దృష్టి సారించారు. వివరాల్లోకి వెళితే.. 40 ఏళ్ల బలరామ్ సింగ్ తన భార్య మీనా దేవి (38) మరియు 16 ఏళ్ల కుమారుడితో కలిసి ఆగ్రాలో నివసించేవాడు. అతను జాతరల్లో ఊయలలు (జైంట్ వీల్స్) నడుపుతూ జీవనం సాగించేవాడు. ఇటీవల తన సొంత గ్రామం ‘గరౌ గఢీ’కి తిరిగి రావాలని నిర్ణయించుకోవడంతోనే బలరామ్‌కు కష్టాలు మొదలయ్యాయి.
దేవుడికి దండం పెట్టడం లేదని తండ్రికి అనుమానం: బలరామ్ ఇంటికి వచ్చిన తర్వాత దేవుడి ముందు చేతులు జోడించడం మానేశాడని, కనీసం ప్రసాదం కూడా తీసుకోవడం లేదని అతని తండ్రి శివరాజ్ సింగ్ అనుమానించాడు. దీనిపై సోమవారం తండ్రీకొడుకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అదే రోజు గ్రామస్థుల మద్దతుతో పంచాయితీని పిలిపించాడు. బలరామ్ తమ్ముడు తారాచంద్ (38) కూడా ఈ గొడవలో పాల్గొని తన అన్నపై దాడికి దిగాడు.
పోలీసుల స్పందన: ఈ ఘటన వెలుగులోకి రాగానే ముర్సాన్ ఏరియా సర్కిల్ ఆఫీసర్ యోగేంద్ర కృష్ణ నారాయణ్ నేతృత్వంలోని పోలీసు బృందం దర్యాప్తు చేపట్టింది. “BNSS సెక్షన్ 170 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. నిందితులు శివరాజ్ సింగ్, తారాచంద్లను అరెస్ట్ చేశాం. చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం” అని ఆయన తెలిపారు. సోమవారం జరిగిన పంచాయితీలో పాల్గొన్న ఇతరుల పాత్రపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.
