ప్రారంభానికి ముందే రహదారిలో పగుళ్లు రావడం కలకలం రేపుతోంది. సుమారు రూ.4,000 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న నాలుగు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేలో మరోసారి నాణ్యతపై ప్రశ్నలు తలెత్తాయి.
బీహార్‌లోని ముంగేర్ నుంచి మిర్జాచౌకి వరకు నిర్మిస్తున్న ఈ నాలుగు లేన్ల రహదారిలోని ఓ ప్రాంతంలో పగుళ్లు కనిపించాయి. అక్బర్‌నగర్–షాహ్‌కుండ్ సమీపంలోని గంగాపూర్ ప్రాంతంలో సుమారు 50 మీటర్ల మేర రోడ్డుపై పగుళ్లు ఏర్పడ్డాయి. అంతేకాకుండా రహదారి పక్కన మట్టి కూడా కొంత మేర కుంగిపోయినట్లు తెలుస్తోంది.
రోడ్డు పూర్తిగా ప్రారంభించకముందే ఇలా దెబ్బతినడంతో నిర్మాణ నాణ్యతపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గంగాపూర్ సమీపంలో నిర్మిస్తున్న రెండో ప్యాకేజీలో ఈ సమస్య కనిపించినట్లు సమాచారం. పగుళ్లు సుమారు 2 అంగుళాల లోతు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇదే రహదారిలో గతంలో కూడా పెద్ద పగుళ్లు ఏర్పడ్డాయని స్థానికులు పేర్కొంటున్నారు. అంతేకాదు, పగుళ్లను కప్పిపుచ్చేందుకు వాటిపై జనపనార సంచులు వేసినట్లు కొందరు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు.
ముంగేర్–మిర్జాచౌకి నాలుగు లేన్ల రహదారి ప్రాజెక్టును మొత్తం నాలుగు ప్యాకేజీలుగా నిర్మిస్తున్నారు. ఇందులో రెండో ప్యాకేజీలోని కరియా, కంజియా గ్రామాల సమీపంలో గతంలోనూ రహదారికి పగుళ్లు రావడం, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తడం వంటి ఫిర్యాదులు వచ్చాయి.
కంజియా ప్రాంతంలో దెబ్బతిన్న రహదారి భాగాన్ని తొలగించి, మళ్లీ కాంక్రీట్ వేసినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత కురిసిన భారీ వర్షాలకు ఆ ప్రాంతం మరోసారి దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. 2024 సెప్టెంబర్‌లో కంజియా గ్రామం సమీపంలో రహదారి డ్రైనేజీ భాగం కూడా మట్టిలో కూరుకుపోయింది.
గతంలో ఈ సమస్యలకు గంగా వరదలు, నీటి ఒత్తిడి కారణం కావచ్చని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) అధికారులు తెలిపారు.
తాజాగా గంగాపూర్ సమీపంలో ఏర్పడిన పగుళ్లపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారి నిర్మాణ నాణ్యత, భద్రతపై ఉన్నతస్థాయి సాంకేతిక నిపుణులతో సమగ్ర పరిశీలన చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనపై NHAI టెక్నికల్ మేనేజర్ అభినవ్ కుమార్ స్పందిస్తూ.. వర్షాల కారణంగా ఇలాంటి సమస్య ఏర్పడి ఉండొచ్చని తెలిపారు. కొత్తగా ఏర్పడిన పగుళ్లు ఎప్పుడు వచ్చాయనే దానిపై ప్రస్తుతం అధికారిక సమాచారం లేదన్నారు.
ఈ అంశంపై పూర్తి స్థాయిలో పరిశీలన చేపడతామని, నష్టం తీవ్రంగా ఉన్నట్లు తేలితే దెబ్బతిన్న కాంక్రీట్ భాగాన్ని తొలగించి మళ్లీ రహదారిని నిర్మిస్తామని ఆయన వెల్లడించారు.
ఇక రహదారి ప్రారంభానికి ముందే వరుసగా సమస్యలు తలెత్తుతుండటంతో.. రూ.4,000 కోట్ల భారీ ప్రాజెక్టు నిర్మాణ నాణ్యతపై మరోసారి చర్చ మొదలైంది.

Leave a Reply