బీహార్ రాష్ట్రంలోని శివహర్ జిల్లాలో అర్ధరాత్రి వేళ ప్రియురాలిని కలవడానికి వెళ్లాడని చెబుతున్న ఒక యువకుడిని కొట్టి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
బుధవారం అర్ధరాత్రి దాదాపు 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మృతి చెందిన యువకుడిని లలన్ కుమార్‌గా గుర్తించారు. ప్రియురాలిని కలవడానికి వెళ్లిన అతడిని కొందరు పట్టుకుని దారుణంగా కొట్టినట్లు తెలుస్తోంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… రాత్రి సమయంలో లలన్ కుమార్ తన ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ప్రేమ వ్యవహారంపై అక్కడ గొడవ జరిగింది. దీంతో కొందరు అతడిని లాఠీలు, కర్రలు, ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా బాదారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే స్థానికులు భారీగా తరలిరావడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శివహర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణం కావచ్చని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీస్ స్టేషన్ అధికారి ఉమాకాంత్ సింగ్ తెలిపారు. అయితే ఈ దాడిలో ఎంతమంది పాల్గొన్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసులను మోహరించారు. హత్యకు గల అసలు కారణాలు, దాడికి పాల్పడిన వారి గురించి పోలీసులు స్థానికులను విచారిస్తున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. అర్ధరాత్రి వేళ ప్రియురాలిని కలవడానికి వెళ్లిన యువకుడు దాడిలో ప్రాణాలు కోల్పోవడం ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనంగా మారింది.

Leave a Reply