హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి, 2022 నవంబర్‌లో ‘నివా బూపా’ (Niva Bupa) సంస్థ నుండి ₹5 లక్షల విలువైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నారు. ఈ పాలసీ తనకు, తన భార్యకు మరియు పిల్లలకు రక్షణ కల్పిస్తుందని ఆయన నమ్మారు.
దురదృష్టవశాత్తూ, పాలసీ వ్యవధిలోనే ఆయన భార్యకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీనికోసం చండీగఢ్‌లోని ఒక ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందించారు. ఈ చికిత్స కోసం ఆయన సుమారు ₹5 లక్షల వరకు సొంత డబ్బును ఖర్చు చేశారు. అయితే, ఆ ఖర్చును తిరిగి చెల్లించాలని (క్లెయిమ్) ఇన్సూరెన్స్ సంస్థను కోరినప్పుడు, “పాలసీ తీసుకోవడానికి ముందే ఆమెకు రొమ్ము క్యాన్సర్ ఉందని, ఆ విషయాన్ని దాచిపెట్టి పాలసీ తీసుకున్నారని” పేర్కొంటూ సంస్థ క్లెయిమ్‌ను తిరస్కరించింది.
దీనిని సవాలు చేస్తూ బాధితుడు సోలన్ కన్స్యూమర్ కోర్టులో కేసు వేశారు. కేసును విచారించిన కోర్టు, “పాలసీదారుని భార్యకు ఇప్పటికే వ్యాధి ఉందని నిరూపించడానికి ఇన్సూరెన్స్ సంస్థ ఎటువంటి బలమైన సాక్ష్యాలను లేదా దర్యాప్తు నివేదికలను సమర్పించడంలో విఫలమైంది” అని స్పష్టం చేసింది.
దీంతో, బాధితురాలి వైద్య ఖర్చుల కింద ₹80,439ని 9 శాతం వడ్డీతో చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా, మానసిక వేదన కలిగించినందుకు పరిహారంగా ₹30,000 మరియు కోర్టు ఖర్చుల కోసం ₹20,000.. మొత్తంగా ₹1.3 లక్షలకు పైగా నగదును 30 రోజుల్లోపు పాలసీదారునికి చెల్లించాలని ఇన్సూరెన్స్ సంస్థకు వినియోగదారుల కోర్టు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది.
