ప్రేమ మరణాన్ని కూడా జయించగలదు! 55 రోజుల కోమా.. స్నేహితుల పిలుపు విని కళ్లు తెరిచిన ఎనిమిదేళ్ల బాలుడు!

ప్రపంచాన్ని కన్నీరు పెట్టించడంతో పాటు కొత్త ఆశను చిగురింపజేసే వార్త చైనాలోని హునాన్ ప్రావిన్స్ నుండి వెలువడింది. మరణానికి, జీవితానికి మధ్య 55 రోజుల పాటు ఊగిసలాడుతూ ‘కోమా’ స్థితిలో ఉన్న ఎనిమిదేళ్ల బాలుడు ‘లియు చుక్సీ’ తిరిగి ప్రాణాలతో కోలుకున్నాడు.

అసలేం జరిగింది? గత నవంబర్‌లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో లియు మెదడు, ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ బాలుడు మళ్ళీ కోలుకునే అవకాశాలు చాలా తక్కువని వైద్యులు భావించారు. కానీ ఆ తల్లి పట్టుదల, స్నేహితుల ప్రేమ ఆ చిన్నారిని మృత్యుంజయుడిని చేశాయి.

చికిత్సలో భాగంగా బాలుడికి బాగా పరిచయమున్న గొంతులను వినిపించడం వల్ల మెదడు స్పందించే అవకాశం ఉందని వైద్యులు సూచించారు. దీంతో లియు తల్లి కోరిక మేరకు పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అండగా నిలిచారు. స్కూల్లో వారు పాడే వ్యాయామ గీతాలు, పాఠాలు, స్నేహితుల సందేశాలను రికార్డు చేసి ప్రతిరోజూ లియు మంచం దగ్గర వినిపించేవారు. “చుక్సీ, త్వరగా లే.. మనం ఫుట్‌బాల్ ఆడుకుందాం”, “మేమంతా నిన్ను మిస్ అవుతున్నాం” అన్న స్నేహితుల పిలుపులు ఆ హాస్పిటల్ గదిలో నిత్యం మారుమోగుతూ ఉండేవి.

వైద్యులే ఆశ్చర్యపోయేలా.. 55 రోజుల నిరీక్షణ తర్వాత అద్భుతం జరిగింది. స్నేహితుల గొంతులు విన్న లియు మొదట చిరునవ్వు చిందించాడు, ఆపై కనురెప్పలు కదిలించాడు. 55వ రోజున అతడు పూర్తి స్పృహలోకి వచ్చి తన ఎడమ చేతిని పైకి లేపాడు. పరామర్శకు వచ్చిన టీచర్ సరదాగా “నీకు ఇకపై హోంవర్క్ ఉండదు” అని అనగానే, లియు సంతోషంతో చేతులు ఊపడం అక్కడి వారిని కన్నీరు పెట్టించింది. “చివరికి మబ్బులను చీల్చుకుని సూర్యుడిని చూశాను” అంటూ ఆ తల్లి భావోద్వేగానికి లోనయ్యింది.


Posted

in

by

Tags: