ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వైద్య ఖర్చులను అదుపు చేసేందుకు వివిధ రకాల వైద్య పరికరాల (Medical Devices) ట్రేడ్ మార్జిన్లపై గరిష్ట పరిమితిని విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ‘CNBC TV18’ నివేదించింది.
ఆసుపత్రులు వసూలు చేసే మార్జిన్లను నియంత్రించే ప్రతిపాదనను ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమీక్షిస్తోంది. ప్రైవేట్ ఆసుపత్రులు చేస్తున్నట్లుగా భావిస్తున్న అడ్డగోలు బిల్లింగ్‌పై పెరుగుతున్న విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ కొత్త నిబంధనల ప్రకారం.. వైద్య పరికరాల కొనుగోలు ధర (Landing price) కంటే నిర్ణీత శాతం కంటే ఎక్కువ వసూలు చేయడానికి ఆసుపత్రులకు అనుమతి ఉండదు.
రోగులపై ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో, ఈ పరిమితిని ఎలా అమలు చేయాలనే దానిపై ఇన్సూరెన్స్ కంపెనీలు మరియు వైద్య పరికరాల పరిశ్రమ ప్రతినిధులతో ప్రభుత్వం చర్చిస్తోంది. ఇంజక్షన్ సిరంజీలు, గ్లౌజుల వంటి తక్కువ ధర వస్తువుల నుండి పేస్మేకర్లు, హార్ట్ వాల్వ్‌ల వంటి ఖరీదైన పరికరాల వరకు ఈ ధరల పరిమితి వర్తించే అవకాశం ఉంది.
ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయా? దర్యాప్తు వివరాల ప్రకారం.. కొన్ని ఆసుపత్రులు కొన్ని వైద్య పరికరాలపై అసలు ధర కంటే 10 నుండి 30 రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నాయి. ఉదాహరణకు:
- ₹3 ఉండే సిరంజీకి ₹30 వసూలు చేస్తున్నారు.
- ₹6 ఉండే ఐవీ క్యాన్యులాకు ₹120 ఛార్జ్ చేస్తున్నారు.
- ₹25,000 విలువైన పేస్‌మేకర్‌కు ₹2 లక్షలు బిల్లు వేస్తున్నారు.
- అసలు ధర ₹4 లక్షలు ఉండే హార్ట్ వాల్వ్‌లకు ₹26-30 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది.
ఆసుపత్రి బిల్లింగ్‌పై పరిమితి విధించడం వల్ల ఆరోగ్య రంగంలో పారదర్శకత పెరుగుతుంది, రోగుల జేబులకు చిల్లు పడకుండా ఉంటుంది మరియు ఇన్సూరెన్స్ ప్రీమియంలపై ఒత్తిడి తగ్గుతుంది.
హెల్త్ ఇన్సూరెన్స్ రంగంపై ప్రభావం: ఆసుపత్రి ఖర్చులు పెరగడం వల్ల హెల్త్ ఇన్సూరెన్స్ రంగం కూడా దెబ్బతింటోంది. ఏటా 14-15% మెడికల్ ఇన్ఫ్లేషన్ (వైద్య ద్రవ్యోల్బణం) కారణంగా, వచ్చే ఏడాదిన్నర కాలంలో ఇన్సూరెన్స్ ప్రీమియంలు 10-15% పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆసుపత్రి ఛార్జీలు పెరగడం, అత్యాధునిక చికిత్సలు మరియు క్లెయిమ్స్ సంఖ్య పెరగడం వంటివి దీనికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
