ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త కార్మిక మరియు పన్ను సంస్కరణలు అమలులోకి రానున్నాయి. ఇవి మీ జీతాలు, పన్ను గణనలు మరియు ‘ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్‌మెంట్’ పద్ధతులను పూర్తిగా మార్చబోతున్నాయి. జీతం తీసుకునే భారతీయులపై దీని ప్రభావం ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి:
పే-స్లిప్‌లో మార్పులు: ఇప్పటివరకు భారతీయ కంపెనీలు తమ పీఎఫ్ (EPF) మరియు గ్రాట్యుటీ ఖర్చులను తగ్గించుకోవడానికి ‘బేసిక్ శాలరీ’ని మొత్తం జీతంలో కేవలం 25 నుండి 40 శాతం లోపే ఉంచుతున్నాయి. అయితే, వేతన కోడ్ (Code on Wages), 2019 ప్రకారం.. ఇకపై బేసిక్ పే, కరువు భత్యం (DA) మరియు రిటైనింగ్ అలవెన్స్‌లు కలిసి ఉద్యోగి మొత్తం జీతం (CTC)లో కనీసం 50 శాతం ఉండాలి. ప్రైవేట్ రంగంలో డీఏ ఉండదు కాబట్టి, కంపెనీలు తమ ఉద్యోగుల బేసిక్ పేను తప్పనిసరిగా పెంచాల్సి ఉంటుంది.
పీఎఫ్ పొదుపు పెరుగుదల – 2 రోజుల్లోనే సెటిల్‌మెంట్: బేసిక్ పే పెరగడం వల్ల ఉద్యోగి పీఎఫ్ వాటా మరియు గ్రాట్యుటీ కూడా పెరుగుతాయి. దీనివల్ల నెలకు చేతికి వచ్చే జీతం (Take-home pay) స్వల్పంగా తగ్గినప్పటికీ, రిటైర్మెంట్ సమయంలో వచ్చే నిధి భారీగా పెరుగుతుంది.
- ముఖ్యమైన మార్పు: ఉద్యోగి రాజీనామా చేసిన తర్వాత ‘ఫుల్ అండ్ ఫైనల్’ (F&F) సెటిల్‌మెంట్ కోసం గతంలో 30 నుండి 90 రోజులు పట్టేది. కొత్త చట్టం ప్రకారం, ఉద్యోగి పని చేసిన చివరి రోజు నుండి రెండు పని దినాల్లోనే (2 Working Days) జీతం, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి బకాయిలన్నీ చెల్లించాలి. ఆలస్యమైతే వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది.
కొత్త ఆదాయపు పన్ను చట్టం, 2025: 1961 నాటి పాత ఆదాయపు పన్ను చట్టం స్థానంలో ఆదాయపు పన్ను చట్టం, 2025 అమలులోకి రానుంది. పన్ను రేట్లు లేదా మినహాయింపుల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, చట్టంలోని భాషను సరళతరం చేశారు. ముఖ్యంగా ‘ప్రీవియస్ ఇయర్’ మరియు ‘అసెస్మెంట్ ఇయర్’ అనే గందరగోళ పదాలను తొలగించి, పన్ను చెల్లింపుదారులకు అర్థమయ్యేలా మార్పులు చేశారు.
సోవరేన్ గోల్డ్ బాండ్ల (SGB)పై పన్ను: ఇంతకుముందు ఎస్‌జీబీలను ఎక్కడ కొన్నా మెచ్యూరిటీ సమయంలో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండేది కాదు. కానీ ఇకపై, ఆర్‌బీఐ (RBI) ద్వారా నేరుగా కొన్నవారికి మాత్రమే ఈ పన్ను మినహాయింపు ఉంటుంది. ఒకవేళ మీరు స్టాక్ ఎక్స్ఛేంజ్ (Secondary Market) ద్వారా ఎస్‌జీబీలు కొనుగోలు చేసి ఉంటే, మెచ్యూరిటీ సమయంలో 12.5 శాతం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
ఐటీ రిటర్న్స్ సవరణకు మరింత సమయం: ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో తప్పులను సరిదిద్దుకోవడానికి (Revised Return) ఇచ్చే సమయాన్ని 9 నెలల నుండి 12 నెలలకు పెంచారు. అయితే, 9 నెలల తర్వాత రిటర్న్స్‌ను సవరిస్తే అదనపు రుసుము (Fee) చెల్లించాల్సి ఉంటుంది.
