ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చడ్డాతో పాటు ఇతర ఎంపీలు భారతీయ జనతా పార్టీలో చేరడంతో రాజకీయం వేడెక్కింది. రాఘవ్ బీజేపీలోకి వెళ్లిన తర్వాత పలువురు నేతల నుంచి స్పందనలు రావడం మొదలయ్యాయి.
సామాజిక కార్యకర్త మరియు రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ ఈ పరిణామంపై స్పందిస్తూ.. నేడు జరిగినది కేవలం కొంతమంది వ్యక్తులు పార్టీలో అవమానానికి గురై బయటకు వెళ్లిన విషయం మాత్రమే కాదన్నారు.
రాఘవ్ చద్దాకు పార్టీపై ఉన్న ఫిర్యాదులు సమంజసమే కావచ్చు, కానీ అతనిపై కూడా వందమందికి ఫిర్యాదులు ఉండవచ్చు అని ఆయన పేర్కొన్నారు. “ఈ చర్య ఫిరాయింపు నిరోధక చట్టం (Anti-Defection Law) యొక్క స్ఫూర్తిని పూర్తిగా నాశనం చేస్తుంది. ఇది రాజ్యాంగ విలువలకి వ్యతిరేకం మరియు ప్రజాస్వామ్య మూలాలను బలహీనపరుస్తుంది. మీకు అంతగా అసంతృప్తి ఉంటే, పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయకూడదు?” అని ప్రశ్నించారు.
ఆప్ తీరుపై విమర్శలు: ఆమ్ ఆద్మీ పార్టీని తాను సమర్థించడం లేదని యోగేంద్ర యాదవ్ స్పష్టం చేశారు. “నేను ఎప్పుడూ ఆప్ ఎంపీలతో మాట్లాడలేదు, ఆ పార్టీని వెనకేసుకు రాలేదు. కేవలం అధికారం కోసమే నాయకులు వచ్చే ఒక వేదికగా ఆప్‌ను మార్చేశారు” అంటూ ఆ పార్టీ నాయకత్వంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు.
రాఘవ్ చద్దాపై విమర్శల బాణాలు: రాఘవ్ చద్దాను ఉద్దేశించి మాట్లాడుతూ.. “అన్ని పదవులు పొందిన తర్వాత కూడా ఇలా జరగడం ఎలా సాధ్యం? రాజ్యాంగ స్ఫూర్తిని ఎందుకు చంపేస్తున్నారు?” అని నిలదీశారు. దేశంపై ప్రస్తుతం ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు, ఒకే పార్టీ, ఒకే నాయకుడు’ అనే మోడల్‌ను రుద్దాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాఘవ్ చద్దా మూడింట రెండొంతుల మంది రాజ్యసభ ఎంపీలతో కలిసి పార్టీని వీడటాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
