ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసిన ఒక యువతి, తన ఇంటికి ఫుడ్ తీసుకువచ్చిన డెలివరీ బాయ్ మరెవరో కాదు, తన ప్రియుడే అని తెలిసి షాక్‌కు గురైంది.
ప్రతిరోజూ రాత్రి పని ఒత్తిడి వల్ల మాట్లాడలేకపోతున్నానని, చాలా ‘బిజీ’గా ఉన్నానని చెబుతూ వచ్చిన ఆమె ప్రియుడు.. నిజానికి తన స్నేహితుడికి బదులుగా ఆ పని చేస్తున్నాడని, అదనపు ఆదాయం కోసం డెలివరీ బాయ్‌గా కష్టపడుతున్నాడని ఆమెకు అనుకోకుండా తెలిసింది. అతను హెల్మెట్ తీయమని ఆమె పట్టుబట్టినప్పుడు, తన ముందు చెమటలు కక్కుతూ నిలబడి ఉన్న ప్రియుడిని చూసి ఆమె నిశ్చేష్టురాలైంది. ఎందుకు అబద్ధం చెప్పావని కన్నీళ్లతో అడిగిన ప్రియురాలికి ఆ యువకుడు ఇచ్చిన సమాధానం అందరి హృదయాలను తాకింది.
“ఇది బహిరంగ ప్రదేశం, ఇక్కడ ప్రతిదీ వివరించలేను. కానీ నేను ఏం చేసినా అది మన భవిష్యత్తు కోసం, నిన్ను బాగా చూసుకోవడం కోసమే చేస్తున్నాను” అని ఆ యువకుడు ఎంతో భావోద్వేగంగా చెప్పాడు. ఖరీదైన బహుమతులు, విలాసవంతమైన సర్‌ప్రైజ్‌ల కంటే.. తనపై ఉన్న నిజమైన ప్రేమ, ప్రియుడి అంకితభావమే తనకు ముఖ్యమని గ్రహించిన ఆ యువతి అతడిని కౌగిలించుకుంది. నిజమైన ప్రేమ అంటే కేవలం గులాబీలు, రంగురంగుల వేడుకల్లో మాత్రమే ఉండదని.. లోకానికి తెలియని ఇలాంటి నిశ్శబ్ద త్యాగాల్లో, ప్రేమ కోసం పడే కష్టంలోనే ఉంటుందని ఈ ఘటన నిరూపించింది.
