ఫోన్లో ఎవరు..? చెల్లెలిపై అన్నకు అనుమానం.. పెళ్లయిన కొద్దిరోజులకే ఘోరం! అత్తవారింటి నుండి ఆదరంగా పిలిపించి సొంత అన్నే హత్య..!!

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేపూర్‌లో.. వివాహమైన తన సొంత చెల్లెలిని అన్నే అత్యంత దారుణంగా హత్య చేసిన దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది.

తన సోదరి మొబైల్ ఫోన్‌లో ఒక యువకుడితో మాట్లాడుతోందని అనుమానించిన అన్న.. ఆమెను అత్తవారింటి నుండి పుట్టింటికి అని నమ్మించి తీసుకువచ్చి, మార్గమధ్యంలోనే గొంతు నులిమి హత్య చేశాడు. హత్య అనంతరం మృతదేహాన్ని బావిలో పడేసి, ఆపై నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

అనుమానమే పెనుభూతమై..
ఫతేపూర్ జిల్లా దరియావ్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన సందీప్ యాదవ్ అనే యువకుడికి.. పెళ్లయిన తర్వాత కూడా తన చెల్లెలు రామీ దేవి (22) వేరే ఒక యువకుడితో ఫోన్లో మాట్లాడుతోందనే అనుమానం ఉండేది. ఆమె ఆ యువకుడితో కలిసి పారిపోతుందేమోనని భయపడిన సందీప్.. సొంత చెల్లెలు అని కూడా చూడకుండా ఆమెను హతమార్చడానికి క్రూరమైన ప్రణాళిక రచించాడు.

దీనికోసం రాధానగర్ ప్రాంతంలోని చెల్లెలి అత్తవారింటికి వెళ్లిన సందీప్.. ఆమెను కొన్ని రోజులు పుట్టింటికి పంపుతానని చెప్పి నమ్మించి తనతో పాటు తీసుకువచ్చాడు. కానీ, ఇంటికి వెళ్లే మార్గమధ్యంలోనే నిర్జన ప్రదేశంలో ఆమె గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆధారాలను దాచిపెట్టేందుకు శవాన్ని సమీపంలోని ఒక బావిలో పడేశాడు. ఆ తర్వాత నేరుగా హస్వాన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తాను చేసిన నేరాన్ని పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు.

ఒకటిన్నర నెలల ముందే పెళ్లి..
నిందితుడు ఇచ్చిన సమాచారంతో షాక్‌కు గురైన పోలీసులు.. తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని బావిలో నుండి యువతి మృతదేహాన్ని వెలికితీశారు. మృతురాలు రామీ దేవికి కేవలం ఒకటిన్నర నెలల క్రితమే వివాహం జరగడం గమనార్హం. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. శవాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘాతుకంపై తదుపరి చట్టపరమైన దర్యాప్తును తీవ్రతరం చేశారు.


Posted

in

by

Tags: