గత వార కాలంగా బంగారం, వెండి ధరల్లో విపరీతమైన హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఇది అటు ఇన్వెస్టర్లను, ఇటు సామాన్యులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. గత గురువారం సరికొత్త గరిష్టాలకు చేరుకున్న బంగారం, వెండి ధరలు కేవలం మూడు రోజుల్లోనే భారీగా పడిపోవడంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియక చాలా మంది సందిగ్ధంలో పడ్డారు.
ఈ నేపథ్యంలో, భారతీయులు తమ సంపదను ఎలా పెంచుకోవాలనే దానిపై ముకేశ్ అంబానీ కొన్ని కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా విపరీతమైన డిమాండ్, పెరుగుతున్న ధరలను చూసి బంగారం, వెండిపై భారీగా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్న వారికి అంబానీ సలహా ఎంతో కీలకం.
ముంబైలో జరిగిన ‘జియో బ్లాక్రాక్’ (Jio BlackRock) కార్యక్రమంలో అంబానీ మాట్లాడుతూ.. గత ఏడాది భారత్ సుమారు 60 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని, 15 బిలియన్ డాలర్ల విలువైన వెండిని దిగుమతి చేసుకుందని గుర్తుచేశారు. అయితే ఇవన్నీ కేవలం పొదుపు రూపంలో ఇళ్లలోనే ఉండిపోతున్నాయని, దేశ ఆర్థిక వృద్ధికి ఇవి పెద్దగా ఉపయోగపడటం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
బంగారం, వెండి కాకపోతే మరేంటి? బంగారం, వెండి కొని ఇంట్లో భద్రపరుచుకోవడం కంటే, ఆ డబ్బును మూలధన మార్కెట్లలో (Capital Markets) పెట్టుబడి పెట్టాలని అంబానీ కోరారు. స్టాక్ మార్కెట్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టినప్పుడు కాంపౌండింగ్ (చక్రవడ్డీ) పద్ధతిలో రాబడి పెరుగుతుందని ఆయన వివరించారు. సాంప్రదాయకంగా బంగారంపై మక్కువ చూపే భారతీయులకు ఈ సూచన ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది.
మూలధన మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం వల్ల కంపెనీల వృద్ధికి సహకారం అందుతుందని, తద్వారా ఉద్యోగ అవకాశాలు పెరిగి దేశ ఆర్థిక వృద్ధి వేగవంతం అవుతుందని అంబానీ వివరించారు. బంగారం భద్రతను ఇస్తుంది కానీ, అది కొత్త సంపదను సృష్టించలేదని ఆయన పేర్కొన్నారు.
అంబానీ అభిప్రాయంతో బ్లాక్రాక్ సీఈఓ లారీ ఫింక్ కూడా ఏకీభవించారు. “రాబోయే 20 ఏళ్లలో భారత స్టాక్ మార్కెట్ రెండు, మూడు లేదా నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉంది, కానీ బంగారం ఎప్పటికీ ఆ స్థాయిలో రాబడిని ఇవ్వలేదు” అని ఆయన వ్యాఖ్యానించారు.
