భారతదేశంలో బీజేపీ (భారతీయ జనతా పార్టీ) అతిపెద్ద రాజకీయ పార్టీ. కేంద్రంలో కూటమి ప్రభుత్వాన్ని నడుపుతోంది. అయితే, తాజాగా బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో కూడా ‘BJP’ తన మొదటి విజయాన్ని నమోదు చేసిందనే వార్త ఇంటర్నెట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ అభ్యర్థి మరియు పార్టీ నేపథ్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బంగ్లాదేశ్ రాజకీయ పరిస్థితి: 2024లో విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారడంతో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి భారత్‌లో ఆశ్రయం పొందారు. ఆ తర్వాత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ క్రమంలో భారత్-బంగ్లాదేశ్ సంబంధాల్లో తీవ్రమైన విబేధాలు వచ్చాయి. అక్కడి హిందూ మైనారిటీలపై దాడులు జరగడాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ ఉద్రిక్తతల మధ్యే బంగ్లాదేశ్‌లో పార్లమెంటు ఎన్నికలు జరిగాయి.
ఎన్నికల ఫలితాలు: షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ పోటీపై నిషేధం విధించడంతో, ప్రధానంగా తారిక్ రెహమాన్ నేతృత్వంలోని BNP (బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ) మరియు జమాత్-ఇ-ఇస్లామీ మధ్య పోటీ నెలకొంది. మొత్తం 300 స్థానాలకు గాను 299 స్థానాలకు ఎన్నికలు జరగగా, BNP పార్టీ 209 స్థానాల్లో ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.
అసలు ఆ BJP ఎవరు? ఈ ఎన్నికల్లో BNP కూటమిలోని ‘బంగ్లాదేశ్ జాతీయ పార్టీ’ (Bangladesh Jathiya Party) ఒక స్థానంలో విజయం సాధించింది. ఈ పార్టీ పేరును క్లుప్తంగా ‘BJP’ అని పిలుస్తారు. అందుకే బంగ్లాదేశ్‌లో బిజెపి గెలిచిందనే వార్తలు వైరల్ అయ్యాయి. కానీ, వాస్తవానికి ఇది మన దేశంలోని ‘భారతీయ జనతా పార్టీ’ కాదు. ఇది బంగ్లాదేశ్‌కు చెందిన ఒక స్థానిక రాజకీయ పార్టీ.
గెలిచిన అభ్యర్థి: బంగ్లాదేశ్ జాతీయ పార్టీ (BJP) తరపున బోలో-1 నియోజకవర్గం నుండి పోటీ చేసిన అందలీవ్ రెహమాన్ 1,05,543 ఓట్లతో విజయం సాధించారు. తన ప్రత్యర్థి అయిన జమాత్-ఇ-ఇస్లామీ అభ్యర్థి నజ్రుల్ ఇస్లాంపై ఆయన గెలుపొందారు. ఆ పార్టీ చరిత్రలో ఎన్నికల్లో గెలవడం ఇదే తొలిసారి.
