బెంగళూరులో ఒక ప్రైవేట్ లగ్జరీ బస్సులో ప్రయాణించిన 22 ఏళ్ల యువకుడు మరియు అతని స్నేహితురాలికి ఎదురైన చేదు అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
ఆ యువకుడు తన స్నేహితురాలితో కలిసి సౌకర్యవంతంగా ప్రయాణించాలని మొత్తం 3 స్లీపర్ సీట్లను బుక్ చేసుకున్నాడు. ప్రయాణ సమయంలో వారిద్దరూ ఒకే సీటులో కూర్చుని మాట్లాడుకుంటూ, ఆహారం తింటుండటం గమనించిన బస్సు కండక్టర్.. ఒక్కసారిగా వారి దగ్గరకు వచ్చి విడివిడి సీట్లలో కూర్చోవాలని బెదిరించాడు. వారు అందుకు నిరాకరించడంతో, “మీ అమ్మనాన్నలకు ఫోన్ చేస్తాను”, “పోలీసులను పిలుస్తాను” అంటూ ఏకవచనంతో మాట్లాడుతు తీవ్ర వాగ్వాదానికి దిగాడు.
ఎందుకు వచ్చిన గొడవ అని భయపడి ఆ యువకులు విడివిడి సీట్లకు మారినప్పటికీ.. సరైన ధర చెల్లించి టిక్కెట్లు కొనుగోలు చేసిన తర్వాత కూడా తమకు ఎదురైన ఈ ‘మోరల్ పోలీసింగ్’ వేధింపుల గురించి ఆ యువకుడు రెడ్డిట్ (Reddit) వేదికగా తన ఆవేదనను పంచుకున్నాడు.
దీనిపై స్పందించిన నెటిజన్లు, “డబ్బు చెల్లించి సీట్లు కొన్న తర్వాత అందులో జోక్యం చేసుకునే అధికారం కండక్టర్‌కు లేదు” అని, “ఖాళీ అయిన సీటును ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతోనే కండక్టర్ ఇలా చేసి ఉండవచ్చు” అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
