బాక్సాఫీస్ హిట్టే.. కానీ 40 జంటల ప్రాణాలు తీసింది! ‘మరో చరిత్ర’ క్లైమాక్స్ చూసి దర్శకుడు కె.బాలచందర్ ఎందుకు వణికిపోయారు?

సినిమా అనేది సమాజంపై, ముఖ్యంగా యువతపై ఎంతటి గాఢమైన ప్రభావం చూపుతుందో చెప్పడానికి ‘మరో చరిత్ర’ ఒక ఉదాహరణ. నటుడి స్టైల్, డైలాగులనే కాకుండా.. కొన్నిసార్లు సినిమాలో చూపించే భావోద్వేగాలను కూడా ప్రేక్షకులు తమ నిజ జీవితంలోకి అన్వయించుకుంటారు. 1970-80వ దశకంలో వచ్చిన ‘మరో చరిత్ర’ అప్పట్లో యువతను అంతలా ప్రభావితం చేసింది.

దర్శక శిఖామణి కె. బాలచందర్ తెరకెక్కించిన ఈ క్లాసిక్ చిత్రంలో కమల్ హాసన్, సరిత అద్భుతంగా నటించారు. భాషా భేదాలున్న ఒక తమిళ కుర్రాడు (బాలు), తెలుగు అమ్మాయి (స్వప్న) మధ్య చిగురించిన ప్రేమ కథ ఇది. అయితే రెండు కుటుంబాల మధ్య ఉన్న విభేదాల వల్ల వారు ఏకం కాలేకపోతారు. కలిసి బతకలేమని తెలిసినప్పుడు.. కనీసం తమ ప్రేమను శాశ్వతం చేసుకోవాలని భావించి ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకుంటారు. ఈ విషాద ముగింపు అప్పట్లో ప్రేక్షకుల మనసులను పిండేసింది.

నాయిక కోసం 160 మందికి పైగా ఆడిషన్స్: ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం బాలచందర్ ఎంతో శ్రమించారు. సుమారు 161 మంది యువతులను తిరస్కరించిన తర్వాతే సరితను ఎంపిక చేశారు. సినిమాలో కమల్ హాసన్ పాత్ర తమిళ అబ్బాయి కావడంతో ఆయన తెలుగు మాట్లాడాల్సిన అవసరం లేకపోయింది, కానీ సరిత పాత్ర మాత్రం నటనకు ఎంతో ప్రాధాన్యం ఉన్నది కావడంతో అంత జాగ్రత్తగా ఎంపిక చేశారు.

ఈ సినిమా ఘనవిజయం సాధించిన తర్వాత దీనిని హిందీలో ‘ఏక్ తూజే కేలియే’ పేరుతో రీమేక్ చేశారు. అందులో కమల్ సరసన రతీ అగ్నిహోత్రి నటించారు. అక్కడ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

పెరిగిన ఆత్మహత్యలు – దర్శకుడి దిగ్భ్రాంతి: ‘మరో చరిత్ర’ సినిమా విడుదలైన తర్వాత ప్రేమికుల వరుస ఆత్మహత్యలు పోలీసులను, సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేశాయి. అంతకుముందు వరకు ప్రేమ విఫలమైతే కుంగిపోవడం లేదా ‘దేవదాసు’లా తాగుడికి బానిసవ్వడం చూశాం. కానీ ‘కలిసి బతకలేకపోతే.. కలిసి చనిపోదాం’ అనే ఆలోచన ఈ సినిమా క్లైమాక్స్ నుంచే మొదలైందని సినీ విశ్లేషకులు చెబుతుంటారు.

అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. ఈ సినిమా విడుదలైన తర్వాత సుమారు 40 జంటలు ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదికలు వచ్చాయి. కేవలం వినోదం కోసం తీసిన సినిమా ఇంతటి విషాదాన్ని నింపడం చూసి దర్శకుడు కె. బాలచందర్ తీవ్రంగా కలత చెందారు. ఆ సంఘటనల తర్వాత ఆయన తన సినిమాల్లో క్లైమాక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. దురంతాలతో ముగిసే క్లైమాక్స్ ఉండకుండా ఎంతో అప్రమత్తంగా ఉండేవారు.


Posted

in

by

Tags: