బాబోయ్..! ఇకపై తినాలనిపించినా ఇదే గుర్తొస్తుంది.. నూడుల్స్, సేమియాలో ఇంతటి కల్తీనా? వెన్నులో వణుకు పుట్టించే దారుణం..!

మధ్యప్రదేశ్ రాష్ట్రం భింద్ జిల్లాలో ఎలాంటి అనుమతులు (లైసెన్స్) లేకుండా, అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో నడుస్తున్న నూడుల్స్, సేమియా తయారీ ఫ్యాక్టరీపై ఆహార భద్రతా అధికారులు ఆకస్మిక దాడి చేసి సీజ్ చేశారు.

రాబోయే రక్షాబంధన్ పండుగ రద్దీని ఆసరాగా చేసుకుని, నాణ్యత లేని కల్తీ ఆహార పదార్థాలను పొరుగు జిల్లాలకు సరఫరా చేసేందుకు ప్లాన్ చేసినట్లు విచారణలో బట్టబయలైంది.

అధికారుల తనిఖీల్లో అత్యంత మురికిగా, అపరిశుభ్రమైన పరిస్థితుల్లో వీటిని తయారు చేస్తున్నట్లు తేలింది. ఫ్యాక్టరీ నుంచి సుమారు 200 బస్తాల మైదా పిండి, 50 కార్టన్ బాక్సుల నూడుల్స్, భారీ ఎత్తున ముడి సరుకులను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, ‘రియల్ గోల్డ్ మోతీ సేమియా’ పేరుతో ఉన్న ప్యాకెట్లలో అక్రమంగా నూడుల్స్‌ను ప్యాక్ చేసి విక్రయానికి సిద్ధంగా ఉంచిన విస్తుపోయే నిజం వెలుగులోకి వచ్చింది.

ఇంతేకాకుండా, తయారీ భింద్ ప్రాంతంలో జరుగుతుండగా.. ప్యాకెట్లపై చిరునామాను మాత్రం గ్వాలియర్, ఝాన్సీ నగరాల పేర్లతో ముద్రించినట్లు గుర్తించారు. దాదాపు ₹4 లక్షలకు పైగా విలువైన సరుకును స్వాధీనం చేసుకున్న అధికారులు, ఉత్పత్తిని తక్షణమే నిలిపివేసి ఫ్యాక్టరీని సీజ్ చేశారు. నమూనాలను సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపించారు.

ల్యాబ్ నివేదిక రాగానే నిర్వాహకులపై ఆహార భద్రత, ప్రమాణాల చట్టం (FSSAI) కింద కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. కాగా, ఇటీవల గుజరాత్‌లోని సూరత్, బనస్కాంత ప్రాంతాలలో జరిపిన దాడుల్లో కూడా ₹35 లక్షల విలువైన 6,000 లీటర్ల నకిలీ నెయ్యి పట్టుబడటం గమనార్హం.


Posted

in

by

Tags: