ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఆర్థికంగా సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి విద్యా లక్ష్మి యోజన (Pradhan Mantri Vidyalaxmi Yojana) ను అమలు చేస్తోంది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ పథకం, ప్రతిభావంతులైన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో, హామీ (Collateral) రహిత విద్యారుణాలను అందిస్తుంది.
పీఎం విద్యా లక్ష్మి యోజన ముఖ్యాంశాలు:
- అర్హత గల విద్య: డిగ్రీ లేదా ఆ పై స్థాయి కోర్సులు ఉన్నత విద్యగా పరిగణించబడతాయి. విద్యార్థి ప్రభుత్వం గుర్తించిన 800కు పైగా ఉన్నత విద్యా సంస్థల్లో ఒక కోర్సులో చేరి ఉండాలి.
- మినహాయింపు: మేనేజ్మెంట్ కోటా కింద సీటు పొందిన విద్యార్థులకు ఈ రుణం లభించదు.
- రుణ మొత్తం: అర్హులైన విద్యార్థికి రూ. 10 లక్షల వరకు రుణం లభిస్తుంది.
- వడ్డీ రేటు: రుణానికి వడ్డీ రేటు బ్యాంక్ యొక్క EBLR (External Benchmark Lending Rate) + 0.5% ఉంటుంది.
వడ్డీ రాయితీలు:
- 3% రాయితీ: రూ. 8 లక్షల లోపు వార్షిక కుటుంబ ఆదాయం ఉన్న విద్యార్థులకు వడ్డీలో 3% తగ్గింపు లభిస్తుంది.
- వడ్డీలో పూర్తి మినహాయింపు: రూ. 4,50,000 కంటే తక్కువ వార్షిక కుటుంబ ఆదాయం ఉండి, PM USP CSIS (Prime Minister’s Special Scholarship Scheme for SC/ST students) కింద సాంకేతిక లేదా వృత్తిపరమైన కోర్సుల్లో చేరిన విద్యార్థులకు వడ్డీలో పూర్తి మినహాయింపు లభిస్తుంది.వడ్డీ రాయితీకి అర్హత ఉన్న విద్యార్థులు చదువులో వెనుకబడి ఉండకూడదు.
మొరటోరియం మరియు తిరిగి చెల్లింపు:
- మొరటోరియం కాలం: రుణం మంజూరైనప్పటి నుండి చదువు పూర్తయిన తర్వాత మరో ఒక సంవత్సరం వరకు ఉన్న కాలాన్ని మొరటోరియం (Moratorium) కాలంగా పరిగణించబడుతుంది.
- ఈ మొరటోరియం కాలంలో వడ్డీ లెక్కించబడుతుంది కానీ, విద్యార్థి ఆ సమయంలో చెల్లించవలసిన అవసరం లేదు.
- తిరిగి చెల్లింపు: మొరటోరియం ముగిసిన తర్వాత రుణాన్ని తిరిగి చెల్లించడానికి 15 సంవత్సరాల సమయం లభిస్తుంది.
ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ:
పీఎం విద్యా లక్ష్మి యోజనకు దరఖాస్తు చేయడానికి ఈ క్రింది దశలను అనుసరించాలి:
- వెబ్సైట్ సందర్శన: పీఎం విద్యా లక్ష్మి యోజన యొక్క అధికారిక వెబ్సైట్ (pmvidyalaxmi.co.in/) ను సందర్శించండి.
- నమోదు (Registration): వెబ్సైట్లో విద్యార్థిగా లాగిన్ అయి, అవసరమైన వివరాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
- దరఖాస్తు: ఆ తర్వాత మళ్లీ స్టూడెంట్ లాగిన్ ద్వారా ప్రవేశించి, ‘అప్లై ఫర్ ఎడ్యుకేషన్ లోన్’ (Apply for Education Loan) పై క్లిక్ చేయండి.
- పత్రాలు అప్లోడ్: అడిగిన అన్ని అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసి, దరఖాస్తును సమర్పించండి.
