న్యూఢిల్లీ: కేవలం యజమాని రాసిన ‘విల్లు’ (Will) ఆధారంగా బెనామీ లావాదేవీలో కొనుగోలు చేసిన ఆస్తిపై ఎవరికీ యాజమాన్య హక్కులు దక్కవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1988 నాటి బెనామీ ఆస్తి లావాదేవీల నిషేధ చట్టం ప్రకారం దీనికి అవకాశం లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
వాణిజ్య ఒప్పందం ప్రకారం మరొక వ్యక్తి సమకూర్చిన నిధులతో కొనుగోలు చేసిన ఆస్తులు బెనామీ ఆస్తి లావాదేవీల నిషేధ చట్టం-1988 కింద మినహాయింపు పొందలేవని న్యాయపీఠం వ్యాఖ్యానించింది. ఇటువంటి ఆస్తులను కేంద్ర ప్రభుత్వం జప్తు చేయవచ్చని తెలిపింది.
జస్టిస్ జె.బి. పార్దివాలా మరియు జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం, బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త కె. రఘునాథ్ పేరుతో ఉన్న ఆస్తి యాజమాన్య వివాదంపై దాఖలైన పిటిషన్‌ను విచారించింది. ఈ కేసులో కె. రఘునాథ్ తన విల్లులో వివాదాస్పద ఆస్తిని ఒక బెనామీ వ్యక్తి పేరు మీద రాశారు. ఆయన మరణానంతరం రఘునాథ్ భార్యాపిల్లలు దీనిని కోర్టులో సవాలు చేశారు.
అయితే, ఈ భూమిని తమ డబ్బుతోనే కొనుగోలు చేశామని దరఖాస్తుదారులు వాదించారు. కర్ణాటక భూ సంస్కరణల చట్టం ప్రకారం తమకు భూమి కొనుగోలు చేసే అవకాశం లేనందున, రఘునాథ్ పేరుతో బెనామీగా కొనుగోలు చేశామని, దీనిని రఘునాథ్ 2018 ఏప్రిల్ 20న నమోదు చేసిన తన విల్లులో పేర్కొన్నారని వారు వాదించారు. తమకు మరియు మృతుడికి మధ్య ఉద్యోగి-యజమాని సంబంధం ఉందని, కాబట్టి ఇది బెనామీ చట్టం నుండి మినహాయింపు పొందుతుందని, ఈ వివాదం విల్లుకు సంబంధించిందే తప్ప బెనామీ లావాదేవీకి సంబంధించింది కాదని వారు పేర్కొన్నారు.
దిగువ న్యాయస్థానం సీపీసీ (CPC) ఆర్డర్ 7, రూల్ 11 ప్రకారం ఈ ఆస్తి బదిలీని రద్దు చేసింది. దీనిని సవాలు చేస్తూ దరఖాస్తుదారులు హైకోర్టుకు వెళ్లగా, అక్కడ కూడా ప్రతికూల తీర్పు రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
కేసు నేపథ్యం:
కె. రఘునాథ్ అనుమానాస్పద మృతి మరియు నకిలీ పత్రాల సృష్టికి సంబంధించిన కేసులో ప్రముఖ వ్యాపారవేత్త డి.కె. ఆదికేశవులు కుమారుడు డి.ఎ. శ్రీనివాస్, కుమార్తె డి.ఎ. కల్పజ, డీవైఎస్పీ ఎస్.వై. మోహన్‌లను సిబిఐ పోలీసులు 2025 డిసెంబర్లో అరెస్ట్ చేశారు. మోసం, నకిలీ పత్రాల సృష్టి, స్టాంపు పేపర్ల ఫోర్జరీ, సాక్ష్యాధారాల విధ్వంసం వంటి అంశాలపై సిబిఐ దర్యాప్తు చేపట్టింది.
హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఈ కేసును నమోదు చేసుకుంది. అంతకుముందు కర్ణాటక పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేశారు. రఘునాథ్, ఆదికేశవులుకు అత్యంత ఆప్తుడు. 2019 మే 4న ఆదికేశవులుకు చెందిన గెస్ట్ హౌస్‌లో రఘునాథ్ ఉరివేసుకున్న స్థితిలో అనుమానాస్పదంగా మరణించారు. పోస్ట్‌మార్టం తర్వాత దీనిని ఆత్మహత్యగా భావించి కేసు క్లోజ్ చేశారు. అయితే, 2020 ఫిబ్రవరి 15న రఘునాథ్ భార్య ఇది హత్య అని ఆరోపిస్తూ ప్రైవేట్ ఫిర్యాదు చేశారు. రఘునాథ్ 2016లో తన భార్య మంజుల పేరు మీద విల్లు రాశారు.
రఘునాథ్ మరణించిన తర్వాత డి.ఎ. శ్రీనివాస్ నకిలీ స్టాంపు పేపర్లను ఉపయోగించి, రఘునాథ్ పేరుతో ఫోర్జరీ విల్లును సృష్టించి ఆస్తులను దక్కించుకోవాలని ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు ఇప్పుడు హైకోర్టు తీర్పును సమర్థిస్తూ బెనామీ లావాదేవీల ద్వారా ఆస్తి హక్కులు చెల్లవని తేల్చి చెప్పింది.
