బిల్లు చూసి కస్టమర్‌కు మైండ్ బ్లాక్! తిన్న వంటకాలతో పాటు ‘గ్యాస్ ఛార్జ్’ వేసిన హోటల్..!!

బెంగళూరు: మధ్యప్రాచ్యంలో యుద్ధం మరియు దేశంలో సిలిండర్ల కొరత వార్తలను ఆసరాగా చేసుకుని, బెంగళూరులోని కొన్ని హోటళ్ల యజమానులు వినియోగదారులను నిలువునా దోచుకోవడం మొదలుపెట్టారు. ఎల్‌పిజి (LPG) కొరతను సాకుగా చూపిస్తూ ‘గ్యాస్ ఛార్జ్’ పేరుతో పగలు గంటలనే వసూళ్లకు పాల్పడుతున్నారు.

వినియోగదారులకు ఇచ్చే బిల్లులో ఆహార పదార్థాల ధరలతో పాటు అదనంగా గ్యాస్ సరఫరా ఛార్జీని కూడా జోడిస్తున్నారు.

బెంగళూరు ‘మిస్టర్ ఆంధ్ర మీల్స్’ హోటల్ ఉదంతం
తాజా ఘటన నగరంలోని ‘మిస్టర్ ఆంధ్ర మీల్స్’ (Mr. Andhra Meals) హోటల్‌లో వెలుగుచూసింది. ఇక్కడ నరేష్ కుమార్ అనే కస్టమర్ ఒక ప్లేన్ దోశ మరియు హాఫ్ చికెన్ కర్రీ ఆర్డర్ చేశారు. భోజనం ముగించి బిల్లు చూడగానే ఆయనకు నోట మాట రాలేదు. బిల్లులో వంటకాల ధరలతో పాటు 30 రూపాయల ‘గ్యాస్ ఛార్జ్’ (Gas Charge) కూడా కలిపారు! అంటే హోటల్ యజమానులు తమ ఇంధన ఖర్చును కూడా కస్టమర్ల నెత్తినే వేస్తున్నారన్నమాట.

పీజీ (PG)లకూ పాకిన సెగ
ఈ దోపిడీ కేవలం హోటళ్లకే పరిమితం కాలేదు. నగరంలోని పలు పీజీలలో కూడా గ్యాస్ కొరతను వంకగా చూపి మెనూలో కోతలు విధించారు. విద్యార్థులు, ఉద్యోగులు తమకు మునుపటిలా రకరకాల వంటకాలు లభించడం లేదని వాపోతున్నారు. చేసేదేమీ లేక బయట హోటళ్లకు వెళ్తే, అక్కడ గ్యాస్ పేరుతో అదనపు బాదుడు తప్పడం లేదు.

బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు
ఈ అన్యాయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కస్టమర్ నరేష్ కుమార్ తన బిల్లు కాపీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. “మనం తినే ఆహారానికే కాకుండా, వండటానికి వాడే గ్యాస్‌కు కూడా విడిగా డబ్బులు చెల్లించాలా?” అని ఆయన ప్రశ్నించారు. బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేస్తూ హోటల్ యజమానుల ఆగడాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. మార్కెట్‌లో చిన్నపాటి కొరతను భూతద్దంలో చూపిస్తూ సామాన్యుల జేబులు కత్తరించడంపై జనం మండిపడుతున్నారు.


Posted

in

by

Tags: