పాట్నా/అరారియా: బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ యుగం ముగిసి, సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న తరుణంలో ఎన్నికల వ్యూహకర్త, జన సూరాజ్ సూత్రధారి ప్రశాంత్ కిషోర్ (PK) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విలువలు, నైతికత గురించి మాట్లాడే బీజేపీ.. బీహార్‌కు ఇచ్చిన ‘తొలి కానుక’ ఇదేనా అంటూ ప్రశ్నించారు.
ప్రశాంత్ కిషోర్ విమర్శల సారాంశం:
మంగళవారం అరారియాలో పర్యటించిన ప్రశాంత్ కిషోర్, కొత్త ముఖ్యమంత్రిపై నేరుగా విమర్శలు గుప్పించారు:
- ముఖం ఒకచోట.. రిమోట్ మరోచోట: “ముఖ్యమంత్రిగా ఒక వ్యక్తిని కూర్చోబెట్టారు కానీ, అసలు చాబీ (తాళం చెవి), రిమోట్ కంట్రోల్ మాత్రం అమిత్ షా చేతుల్లోనే ఉంటాయి. బీహార్‌ను ఇకపై గుజరాత్ నుండి నడుపుతారని బీజేపీ స్పష్టం చేసింది.”
- కూలీలుగానే మిగిలిపోవాలా?: “గుజరాత్‌లోని ఫ్యాక్టరీల్లో బీహార్ యువత కేవలం రూ. 10-12 వేల కోసం పశువుల్లా రైళ్లలో వెళ్లి కూలీ పనులు చేయడమే అమిత్ షా ప్రాధాన్యతలా కనిపిస్తోంది. రాబోయే కాలంలో గుజరాత్ వాళ్లు యజమానులుగా, బీహారీలు అక్కడ కేవలం మజ్దూర్లు (కూలీలు)గా ఉండాలనేదే వీరి ప్లాన్.”
- క్యారెక్టర్ ఏది?: కొత్త సీఎం నడవడిక, వ్యక్తిత్వం చర్చనీయాంశంగా ఉండాలని, కానీ ఇది ‘కొత్త బీజేపీ’ అంటూ ఎద్దేవా చేశారు.
బీహార్ కొత్త ప్రభుత్వంపై ఇతర నేతల స్పందన:
కొత్త సర్కార్ ఏర్పాటుపై రాజకీయ వర్గాల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి:
- ఎంపీ శాంభవి చౌదరి: “బీహార్‌లో నితీష్ యుగం ఎప్పటికీ అంతం కాదు. ఆయన తన ఇష్టప్రకారమే రాజ్యసభకు వెళ్తున్నారు. నితీష్ కుమార్ అన్ని వర్గాలను ఎలాగైతే అభివృద్ధి చేశారో, సామ్రాట్ చౌదరి కూడా అలాగే చేస్తారని ఆశిస్తున్నాను.”
- కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్: “ఎన్డీయే (NDA) శాసనసభాపక్ష నేతగా సామ్రాట్ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాని మోదీ విజన్, నితీష్ కుమార్ అడుగుజాడల్లో ఆయన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని నమ్ముతున్నాను.”
- మంత్రి శ్రవణ్ కుమార్: “బిహార్‌ను దేశంలోనే టాప్-5 రాష్ట్రాల్లో ఒకటిగా నిలపాలన్న నితీష్ కుమార్ సంకల్పాన్ని సామ్రాట్ చౌదరి నెరవేరుస్తారని ఆశిస్తున్నాను.”
