భారతీయ నగరాల్లో ఉద్యోగం మరియు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేయడం తల్లిదండ్రులకు ఒక సవాలుగా మారింది. ఇటువంటి సమయంలో పిల్లల సంరక్షణ కోసం నమ్మకస్థులైన వారు దొరకడం వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితం సజావుగా సాగడానికి ఎంతో కీలకం. బెంగళూరుకు చెందిన ఒక మహిళ, ఇద్దరు ఆయాల సహాయంతో తన ఇద్దరు పిల్లలను ఎలా పెంచుతుందో పంచుకోవడంతో ఆన్లైన్లో పెద్ద చర్చ మొదలైంది. ఇందుకోసం ఆమె నెలకు మొత్తం ₹46,000 ఖర్చు చేస్తోంది.
పర్వీన్ చౌదరి అనే ఈ మహిళకు మూడు మరియు నాలుగు ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసిన వీడియో ప్రకారం, మొదటి ఆయా వంట చేయడం, ఇల్లు శుభ్రపరచడం మరియు 11 గంటల పాటు పిల్లలను చూసుకోవడం వంటి పనులు చేస్తుంది. అవసరమైతే రాత్రి పూట కూడా ఉండటానికి కలిపి ఆమెకు నెలకు ₹32,000 జీతం ఇస్తున్నారు. రెండవ ఆయా, మొదటి ఆయాకు సహాయంగా ఉంటూ ఇతర పనులను చూసుకుంటుంది. ఆమెకు నెలకు ₹14,000 జీతం ఇస్తున్నారు.
పర్వీన్ మాట్లాడుతూ.. “ఈ సహాయం వల్ల నా పిల్లలు సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంటున్నారు. నేను ఎటువంటి ఆందోళన లేకుండా పని చేసుకోగలుగుతున్నాను. నా దగ్గర పనిచేసే ఒక ఆయా తన సంపాదనతో తన గ్రామంలో ఉన్న ముగ్గురు పిల్లలను చదివించుకుంటోంది. ఇది కేవలం డబ్బు ఇచ్చి సేవ పొందడం మాత్రమే కాదు, వారి కుటుంబాలకు మేలు చేసే ఒక మార్గం కూడా” అని తెలిపారు.
తన పోస్ట్‌లో ఆమె ఇంకా ఇలా రాశారు: “నా దృష్టిలో ఆయాలు కేవలం పని మనుషులు మాత్రమే కాదు, నా కుటుంబ వ్యవస్థలో ఒక భాగం. నా పిల్లలను చూసుకోవడానికి ఇద్దరు ప్రేమగల పిన్నిలు దొరికినట్లుగా అనిపిస్తుంది. సరైన వ్యక్తులు దొరికినప్పుడు వారిని నేను పూర్తిస్థాయిలో నమ్ముతాను. నేను పని చేయడానికి, ప్రయాణాలు చేయడానికి వారు ఎంతో సహాయపడుతున్నారు. వారికి ఇచ్చే జీతం వల్ల వారు తమ పిల్లలకు మంచి విద్యను అందించగలుగుతున్నారు.”
