పశ్చిమ బెంగాల్‌లో ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాకు సంబంధించి ఒక కీలక అప్‌డేట్ వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘ప్రత్యేక సమగ్ర పునర్విచారణ’ (Special Intensive Revision- SIR) ప్రక్రియ ముగియడంతో తుది ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఈ ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 90 లక్షల మందికి పైగా ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించారు.
ఓటర్ల జాబితాను పారదర్శకంగా, ఖచ్చితంగా ఉంచే లక్ష్యంతో ఎన్నికల సంఘం ఈ చర్య తీసుకుంది. మరణించిన వారు, ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి మారిన వారు మరియు ఒకే వ్యక్తి పేరు రెండు చోట్ల (డూప్లికేట్) ఉన్న పేర్లను గుర్తించి తొలగించారు. మొత్తం 90,83,345 పేర్లను లిస్ట్ నుండి తొలగించినట్లు అధికారులు ధృవీకరించారు.
ముర్షిదాబాద్‌లో అత్యధికం:
ఎన్నికల ప్రధాన అధికారి (CEO) కార్యాలయ గణాంకాల ప్రకారం, అత్యధికంగా ముర్షిదాబాద్ జిల్లాలో 4,55,137 పేర్లను తొలగించారు. ఆ తర్వాత ఉత్తర 24 పరగణాల జిల్లాలో 3,25,666 పేర్లు తొలగించబడ్డాయి. కూచ్ బెహర్, ఉత్తర దినాజ్‌పూర్, మాల్దా, నదియా మరియు దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో కూడా భారీగా పేర్లను కత్తిరించారు.
రెండు దశల్లో ఎన్నికలు:
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెలలో రెండు దశల్లో జరగనున్నాయి:
- మొదటి దశ: ఏప్రిల్ 23 (152 నియోజకవర్గాలు)
- రెండో దశ: ఏప్రిల్ 29 (142 నియోజకవర్గాలు)
- ఫలితాల విడుదల: మే 4, 2026
మీ పేరును ఇలా తనిఖీ చేసుకోండి:
ఓటర్లు తమ పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్‌ను సందర్శించవచ్చు. జిల్లా వారీగా డేటాను అందుబాటులో ఉంచారు, తద్వారా పారదర్శకత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
