కర్ణాటక రాష్ట్రం ధార్వాడ్ నగరంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో 45 ఏళ్ల అనస్థీషియా నిపుణుడు డాక్టర్ కిరణ్ హొనన్నవర్ రక్తపు మడుగులో శవమై కనిపించారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఆయన, తన ఇంటిలోని ఒక గదిలో అత్యంత కిరాతకంగా హత్యకు గురై పడి ఉన్నారు.
అదే ఇంట్లోని మరో గదిలో ఆయన 8 ఏళ్ల కుమారుడు ఒంటిపై తీవ్రమైన కత్తిపోటు గాయాలతో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నాడు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బాలుడికి ఇంకా ప్రాణం ఉండటాన్ని గమనించి తక్షణమే రక్షించి, చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూ (ICU)కి తరలించారు.
ఈ ఘోర నేరానికి సంబంధించి మృతుడి భార్య, వృత్తిరీత్యా లేడీ డాక్టర్ అయిన ప్రియాంకను పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. బంధువులు, స్నేహితులు మంగళవారం రాత్రి మరియు బుధవారం ఉదయం డాక్టర్ కిరణ్‌కు ఫోన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు.. ప్రియాంక ఫోన్ ఎత్తి, ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని లేదా డ్యూటీకి వెళ్లారని చెప్పి తప్పించుకునేలా మాట్లాడింది.
దీంతో అనుమానం వచ్చిన బంధువులు బుధవారం సాయంత్రం నేరుగా ఇంటికి వెళ్లి చూడటంతో ఈ దారుణం వెలుగుచూసింది. పోలీసులు ఇంట్లోకి ప్రవేశించిన సమయంలో.. భర్త, కొడుకు రక్తపు మడుగులో పడి ఉన్నప్పటికీ, నిందితురాలు ప్రియాంక ఎలాంటి చలనం లేకుండా మంచంపై పడుకుని మొబైల్ ఫోన్ వాడుతుండటం చూసి పోలీసులే షాక్‌కు గురయ్యారు.
ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో భార్యాభర్తలు, వారి కుమారుడు మాత్రమే ఉన్నారని, బయటి నుండి ఎవరూ లోపలికి వచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పోలీస్ కమిషనర్ ఎన్. శశికుమార్ తెలిపారు. ప్రాథమిక విచారణలో ప్రియాంక తీవ్ర దిగ్భ్రాంతి (షాక్)లో ఉన్నట్లు నటిస్తోందని, పొంతన లేని సమాధానాలు చెబుతోందని పోలీసులు పేర్కొన్నారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ హత్య జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్న పోలీసులు.. సీసీటీవీ దృశ్యాలు, క్లూస్ టీమ్ మరియు ఫోరెన్సిక్ ఆధారాలతో కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
