మధ్యప్రదేశ్ రాష్ట్రంలో యాసిడ్ తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నయీమ్ భార్య నిలోఫర్ (29) అనే మహిళ దారుణంగా ప్రాణాలు కోల్పోయింది.
ఆమె మృతిపై తీవ్ర అనుమానాలు ఉన్నాయని మృతురాలి పుట్టింటి వారు ఆరోపించడంతో, శ్మశానవాటికలో ఖననం చేసిన ఆమె మృతదేహాన్ని పోలీసులు సమాధి నుంచి బయటకు తీయించారు.
గత ఆగస్టు 15వ తేదీన నిలోఫర్ యాసిడ్ తాగడంతో, అత్యంత విషమ పరిస్థితిలో ఇండోర్‌లోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. మొదట్లో ఇరు కుటుంబాల అంగీకారంతోనే మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే, ఆ మరుసటి రోజే నిలోఫర్ సోదరుడు మరియు కుటుంబ సభ్యులు ఈ మరణంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిలోఫర్‌కు ఇది రెండో వివాహమని, గత 9 ఏళ్లుగా ఆమె భర్త నయీమ్‌తో కలిసి జీవిస్తోందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. భర్త గత వివాహ సంబంధాల కారణంగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని, నిలోఫర్‌ను అతడు శారీరకంగా తీవ్రంగా వేధించేవాడని వారు ఆరోపించారు.
ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న నిలోఫర్ అంత తేలికగా ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదని, హడావుడిగా అంత్యక్రియలు పూర్తి చేసి తమతో బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో డిప్యూటీ కలెక్టర్ ఆదేశాల మేరకు సమాధిని తవ్వి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్ట్‌మార్టం నివేదిక, కుటుంబ సభ్యుల వాంగ్మూలాల ఆధారంగా తదుపరి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
