సైబర్ నేరగాళ్లు సామాన్యులే కాకుండా విద్యావంతులను, వృద్ధులను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా ప్రయాగరాజ్‌లో ఒక రిటైర్డ్ టీచర్ తన జీవితకాలపు సంపాదనను సైబర్ దొంగల పాలవకుండా బ్యాంక్ అధికారులు కాపాడారు.
అసలేం జరిగింది? సోమవారం మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో చంచల్ శ్రీవాస్తవ అనే వృద్ధురాలు సివిల్ లైన్స్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) శాఖకు చేరుకున్నారు. ఆమె తన ఖాతాలో ఉన్న 1 కోటి 20 లక్షల రూపాయలను ఒక అపరిచిత ఖాతాకు వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలని సిబ్బందిని కోరారు. అంత పెద్ద మొత్తాన్ని ఒక్కసారిగా బదిలీ చేయమనడంతో అక్కడి సిబ్బందికి అనుమానం వచ్చి చీఫ్ మేనేజర్ విపిన్ కుమార్‌కు సమాచారం ఇచ్చారు.
మేనేజర్ సమయస్ఫూర్తి: చీఫ్ మేనేజర్ వృద్ధురాలితో మాట్లాడి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఆమె డబ్బు పంపాలనుకున్న ఖాతా గురించి ఆరా తీయగా, అది జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతా అని, ఆ ఖాతా కేవలం అక్టోబర్‌లోనే తెరిచిన కరెంట్ అకౌంట్ అని తెలిసింది.
సైబర్ పోలీసుల సాయంతో: బ్యాంక్ అధికారులు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మరియు బ్యాంక్ అధికారులు ఆమెను మాటల్లో పెట్టి సాయంత్రం వరకు ఆపి ఉంచారు. ఆ తర్వాత విదేశాల్లో ఉంటున్న ఆమె కుమారుడితో ఫోన్లో మాట్లాడారు. చివరికి ఆమె ఫిక్స్డ్ డిపాజిట్లు (FD) రద్దు చేసి మరీ నగదు పంపేందుకు సిద్ధమైనప్పటికీ, మేనేజర్ ఆ ట్రాన్సాక్షన్ ఆపివేశారు.
డిజిటల్ అరెస్ట్ భయం: బాధితురాలు ఒక రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె పొదుపు ఖాతా మరియు ఎఫ్‌డిలలో కలిపి మొత్తం 1.27 కోట్ల రూపాయలు ఉన్నాయి. సైబర్ నేరగాళ్లు ఆమెను ఇన్కమ్ టాక్స్ పేరుతో భయపెట్టి ‘డిజిటల్ అరెస్ట్’ చేసి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అందుకే ఆమె ఎవరికీ చెప్పకుండా అంత డబ్బు పంపేందుకు సిద్ధమయ్యారు.
హెచ్చరిక: బ్యాంక్ మరియు ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. పెద్ద మొత్తంలో నగదు డ్రా లేదా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండటం వల్ల ఈ మోసం ఆగిపోయింది. పిఎన్‌బి జోనల్ మేనేజర్ దీపక్ సింగ్ తన సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు.
