ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడాలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) బ్రాంచ్‌లో సుమారు రూ.10.24 కోట్ల మేర భారీ నగదు కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ వ్యవహారంలో దీపాన్షి అనే మహిళా బ్యాంకు ఉద్యోగిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇతర బ్యాంకు అధికారుల యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఉపయోగించి ఖాతాదారుల ప్రమేయం లేకుండా వారి ఖాతాల నుంచి ఆమె అక్రమ నగదు లావాదేవీలు చేసినట్లు తెలుస్తోంది. ఈ మోసంలో బ్యాంకు వెలుపల ఉన్న మరికొందరి ప్రమేయం కూడా ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో బ్యాంకు చీఫ్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్టోబర్ 29న సీబీఐ అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది.
సంగీత అనే కస్టమర్ తన కుటుంబ సభ్యుల బ్యాంక్ పాస్‌బుక్‌ను అప్డేట్ (ప్రింట్) చేయించుకోవడానికి వెళ్లినప్పుడు ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 16న తమకు తెలియకుండా ఖాతాలో మూడు నగదు లావాదేవీలు జరగడాన్ని చూసి షాక్ అయిన ఆమె, దీనిపై బ్యాంకు అధికారులను వివరణ కోరింది.
దీనిపై అంతర్గతంగా జరిపిన విచారణలో.. పలువురు అధికారుల లాగిన్ వివరాలను ఉపయోగించి దీపాన్షి ఈ అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు బ్యాంకు వర్గాలు గుర్తించాయి. అంతేకాకుండా, ఈ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు కూడా బ్యాంకు రికార్డుల నుంచి మాయమైనట్లు తెలిసింది. ఖాతాదారుల ఫిక్స్డ్ డిపాజిట్లలో (FD) సైతం భారీ అవకతవకలు జరిగాయి. ఏకంగా 49 ఎఫ్డీలను గడువు తీరకముందే (ప్రీ-మెచ్యూర్) క్లోజ్ చేసి, ఆ డబ్బును వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసినట్లు చీఫ్ మేనేజర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ డబ్బును అశుతోష్ పాఠక్ అనే వ్యక్తి బ్యాంకు ఖాతాతో పాటు మరికొందరి ఖాతాలకు మళ్లించినట్లు సమాచారం. అంతేకాకుండా, డబ్బులు డ్రా అయినప్పుడు ఖాతాదారుల మొబైల్ ఫోన్లకు వచ్చే ఎస్సెమ్మెస్ (SMS) అలర్ట్‌లను కూడా ఆ మహిళా ఉద్యోగి నిలిపివేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల తమ ఖాతాల నుంచి డబ్బు డ్రా అయినట్లు వినియోగదారులకు తెలియకుండా పోయింది. గత మూడేళ్లుగా ఈ అక్రమాలు జరుగుతున్నట్లు బ్యాంకు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో దీపాన్షి, అశుతోష్ పాఠక్ తదితరుల పాత్రపై సీబీఐ ముమ్మర దర్యాప్తు చేస్తోంది. ఈ మోసం బారిన పడిన బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం.
