బ్యాంక్ ఖాతాలో జమయిన డబ్బు… భర్త తలకెక్కిన అనుమానం! కొట్టి చంపిన కిరాతకుడు… విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచిన భార్య. అసలేం జరిగింది..?

మహారాష్ట్రలోని నవీ ముంబై సమీపంలోని కలంబోలిలో, భార్య బ్యాంక్ ఖాతాలోకి ఆన్‌లైన్ ద్వారా నగదు జమ కావడం వల్ల రేగిన అనుమానం చివరకు హత్యకు దారితీసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

భార్యను హత్య చేసిన ఆరోపణలపై ఆమె భర్త మనీష్ గోప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడు ఆన్‌లైన్ ఫుడ్, నిత్యావసర వస్తువులను ఇళ్లకు చేరవేసే డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. మృతురాలి పేరు పింకీ మనీష్ గోప్ అలియాస్ సోనియా మహమ్మద్ అబూ ఖాతూన్‌గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం… తన భార్య పలువురితో మాట్లాడుతూ ఉండేదని, ఆమె బ్యాంక్ ఖాతాలోకి రకరకాల వ్యక్తుల నుంచి డబ్బులు బదిలీ అవుతుండటాన్ని చూసి భర్త ఆమెపై తీవ్రంగా అనుమానం పెంచుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అక్టోబర్ 15వ తేదీ అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో మళ్లీ భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో విచక్షణ కోల్పోయిన భర్త, భార్య ముఖం, మెడ, ఛాతీపై పిడిగుద్దులతో దాడి చేయడమే కాకుండా పొట్ట భాగంలో బలంగా కొట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పింకీ స్పృహ కోల్పోయింది. మరుసటి రోజు ఉదయం ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. వెంటనే ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి, చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. అనంతరం భార్యను హత్య చేసిన నిందితుడు మనీష్ గోప్‌ను అదుపులోకి తీసుకున్నారు.

భార్య బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు రావడంపై వచ్చిన అనుమానమే ఈ ఘోరానికి దారితీసిందని ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఆ ఖాతాలోకి ఎవరి నుంచి డబ్బులు వచ్చాయి, వాటికి గల కారణాలేమిటి అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. కుటుంబ కలహాలు, అనుమానం తీవ్ర హింసకు దారితీసి నిండు ప్రాణాన్ని బలిగొన్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అరెస్ట్ అయిన నిందితుడిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *