చాలా సంవత్సరాలుగా, పిల్లలు ఎక్కువ స్క్రీన్ చూడటం వల్లే కంటి చూపు తగ్గుతోందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
కానీ, ఇప్పుడు వైద్యులు వేరే ముఖ్యమైన సమస్యను చూపుతున్నారు: అదే కాలుష్యంతో నిండిన నగర వాతావరణం. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు వంటి అత్యంత కాలుష్య నగరాల్లోని నేత్ర వైద్యులు, పిల్లల్లో చాలా చిన్న వయస్సులోనే కంటి దగ్గరి చూపు (Myopia/Near-sightedness) రావడాన్ని, అది కూడా చాలా వేగంగా పెరగడాన్ని గమనించారు.
ప్రపంచంలోనే అత్యంత కాలుష్యం ఉన్న దేశాలలో భారతదేశం ఒకటిగా ఉంది. ఈ నేపథ్యంలో, కాలుష్యంతో కూడిన గాలి, తక్కువ సూర్యరశ్మి మరియు కంటి చికాకు పట్టడం (eye irritation) పట్టడం వంటివి పట్టణ పిల్లల కంటి చూపును ప్రభావితం చేస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
సాధారణంగా, ఆరోగ్యకరమైన కంటి పెరుగుదలకు పిల్లలకు ప్రకాశవంతమైన బహిరంగ సూర్యరశ్మి చాలా అవసరం. ఇది కంటిలోని డోపమైన్ స్రావాన్ని నియంత్రించి, దగ్గరి చూపు రాకుండా నిరోధిస్తుంది. కానీ, కాలుష్య నగరాల్లో, వాయు కాలుష్యం సూర్యరశ్మి ప్రకాశాన్ని బాగా తగ్గిస్తుంది.
ఇది సహజ రక్షణ కారకాన్ని తొలగిస్తుంది. అంతేకాకుండా, అపరిశుభ్రమైన గాలి కారణంగా పిల్లలు బయట ఆడుకోవడం తగ్గించి, ఎక్కువ సమయం ఇంటి లోపలే ఉంటున్నారు. ఇదే దగ్గరి చూపు (Myopia) ప్రమాదాన్ని పెంచుతోంది.
వాయు కాలుష్యం వల్ల వచ్చే పీఎం 2.5 (PM2.5) వంటి హానికరమైన కణాలు కళ్లకు చికాకు కలిగిస్తాయి. దీని వలన పిల్లలకు కళ్లలో మంట, పొడిబారడం, దురద వంటివి ఏర్పడతాయి. కలుషితమైన గాలి కళ్లకు చికాకు కలిగించి, పిల్లలు తరచుగా కళ్లను రుద్దుకునేలా చేస్తుందని నేత్ర వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా దగ్గరి చూపుకు దారితీసే అసాధారణ కంటి పెరుగుదలకు కారణం కావచ్చు. అంతేకాకుండా, అధిక కాలుష్యం కారణంగా బయటకు వెళ్లడం తగ్గడం వల్ల, పిల్లలు ఎక్కువ సమయం ఇంటి లోపల స్క్రీన్ల ముందు గడుపుతున్నారు. ఇది కూడా దగ్గరి చూపు వేగంగా పెరగడానికి ప్రధాన కారణం అవుతోంది.
కాబట్టి, తల్లిదండ్రులు పిల్లలను రక్షించడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి. గాలి నాణ్యత (AQI) తక్కువగా ఉన్న రోజులలో, అంటే శుభ్రమైన రోజులలో, పిల్లలు ప్రతిరోజూ 60 నుండి 90 నిమిషాలు బయట ఆడుకునేలా చూసుకోవాలి. ఇంట్లో కూడా తగినంత వెలుతురు ఉండాలి.
అంతేకాకుండా, ఎక్కువసేపు స్క్రీన్‌ను చూసేటప్పుడు, 20-20-20 నియమాన్ని పాటించాలి (ప్రతి 20 నిమిషాలకు ఒకసారి, 20 సెకన్ల పాటు, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును చూడాలి). కంటి చూపు మసకబారడం, కళ్లు రుద్దుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
