బళ్లారి (కర్ణాటక): జిల్లాలోని హుస్సేన్ నగర్లో అత్యంత హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒక యువతి మొబైల్లో వీడియో రికార్డ్ చేస్తూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన జీవితంలోని బాధను వివరిస్తూ లైవ్‌లో ప్రాణాలు తీసుకున్న ఈ ఘటన నగరాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
వివరాలు: బళ్లారి హుస్సేన్ నగర్‌కు చెందిన మున్నీ (23) ఆత్మహత్య చేసుకున్న యువతి. ఆమెకు వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, కుటుంబ కలహాల కారణంగా గత ఆరు నెలలుగా భర్తకు దూరంగా పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు మహమ్మద్ షేక్షావలి అనే యువకుడితో పరిచయం ఏర్పడి, అది స్నేహానికి దారితీసింది.
వీడియో తీస్తూ బలవన్మరణం: ఆత్మహత్యకు ముందు మున్నీ తన మొబైల్లో ఒక వీడియో రికార్డ్ చేసింది. అందులో తన బాధను, ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూనే ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భర్తకు దూరంగా ఉండటం, కొత్తగా ఏర్పడిన స్నేహితుడితో కూడా మనస్పర్థలు రావడమే ఈ మరణానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది.
కుటుంబ సభ్యుల ఆరోపణ: మున్నీ మరణానికి మహమ్మద్ షేక్షావలియే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవల వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరిగాయని, ఆ మానసిక వేదనతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని ఫిర్యాదు చేశారు. బళ్లారిలోని గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆత్మహత్యకు ముందు ఆమె రికార్డ్ చేసిన వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
