ఆధునిక కాలంలో మానవ సంబంధాల విలువలు మంటగలుస్తున్నాయి. ఒకవైపు రక్తసంబంధీకుల మధ్య పెళ్లిళ్లు జరగడం వంటి వింతలు కనిపిస్తుంటే, మరోవైపు గృహహింస కేసులు కూడా పెరుగుతున్నాయి. తాజాగా, ఒక కుటుంబంలో బంధాలకే మాయని మచ్చ తెచ్చేలా అత్తాకోడళ్ల వ్యవహారం ఒకటి వెలుగుచూసింది. తన కోడలికి బావతో సంబంధం పెట్టుకోమని అత్త సలహా ఇవ్వడం, దానికి భర్త కూడా మద్దతు పలకడం స్థానికంగా సంచలనం రేపింది.
ఏం జరిగింది? చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న ఒక యువతికి, ఆగ్రాకు చెందిన యువకుడితో ఇటీవల వివాహం జరిగింది. పెళ్లయిన కొన్ని రోజుల వరకు అంతా బాగానే ఉన్నా, తర్వాత భర్తకు సంతానం కలిగే సామర్థ్యం లేదని తెలియడంతో అసలు గొడవ మొదలైంది. భార్య ఈ విషయాన్ని అత్త దృష్టికి తీసుకెళ్లగా, అత్త వైద్యం చేయించాల్సింది పోయి, దిగ్భ్రాంతి కలిగించే సలహా ఇచ్చింది.
బావతో సంబంధం పెట్టుకోమన్న అత్త: “నీ భర్త సంతానానికి పనికిరాడు, అయితేనేం? నీ బావతో సంబంధం పెట్టుకుని బిడ్డను కను” అని అత్త కోడలికి సూచించింది. ఆ మాటలు విని కోడలు షాక్ అయ్యింది. అంతేకాకుండా, బావ కూడా కోడలిపై అసభ్యంగా ప్రవర్తించి, శారీరక సంబంధం కోసం ప్రయత్నించాడని బాధితురాలు ఆరోపించింది. ఈ విషయాలను బాధితురాలు తన భర్తకు చెప్పగా, అతను మాత్రం తన తల్లి చెప్పింది నిజమేనని, తల్లికి వ్యతిరేకంగా మాట్లాడనని తేల్చిచెప్పాడు.
కేసు నమోదు: కుటుంబ సభ్యుల వేధింపులు, కొట్లాటలు ఎక్కువ కావడంతో, బంధువులు జోక్యం చేసుకుని బాధితురాలిని కాపాడారు. ఆమెకు జరిగిన గాయాలకు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ప్రస్తుతం బాధితురాలు షాహ్గంజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. భర్త, అత్త, బావపై మోసం చేయడం, వేధించడం మరియు లైంగిక వేధింపుల ప్రయత్నం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల దర్యాప్తు: ఈ విషయంపై ఎసిపి గౌరవ్ సింగ్ మాట్లాడుతూ, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ఆమె చేసిన ప్రతి ఆరోపణపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. షాహ్గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కూడా దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
